Mekapati Goutham Reddy comments on kia motorsఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అయోమయంలో ఉన్నట్టు ఉంది. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు హయాంలో వచ్చిన కియా మోటార్స్ కంపెనీని అనేక రకాలుగా నిందించింది ఆ పార్టీ. అయితే అధికారంలోకి రాగానే సీన్ మారిపోయింది. అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజింద్రనాథ్ రెడ్డి 2007లో స్వర్గీయ రాజశేఖరరెడ్డి రాసిన లేఖ వల్లే కియా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని క్రెడిట్ తీసుకునే ప్రయత్నంలో అభాసుపాలు అయ్యారు.

ఆ కంపెనీ తొలి కారు ప్రొడక్షన్ లాంచ్ ముఖ్యమంత్రి వెళ్ళడానికి రెడీ అయ్యి విమర్శలు రావడంతో చివరినిముషంలో తప్పుకున్నారు. మంత్రులను, ప్రజాప్రతినిధులనూ పంపితే హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ అక్కడ సమయం సందర్భం లేకుండా రచ్చ చేసి వచ్చారు. ఇప్పుడు తాజాగా పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి ఏకంగా కియా ఆంధ్రప్రదేశ్ పాలిట గుదిబండ అని, ఈ ఒక్క కంపెనీకి ఇచ్చే రాయితీల వల్ల రాష్ట్రంపై 20 సంవత్సరాలలో 20000 కోట్ల భారం పడుతుందని కొత్త పల్లవి అందుకున్నారు.

కియాకు ఇచ్చిన ప్రోత్సాహకాలలో పదవ వంతు కూడా ఇవ్వకుండా 2012-13లో ఇస్యూజు వచ్చిందని మంత్రిగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన ప్రోత్సాహకాలను సమీక్షించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఒకపక్క 2007లో స్వర్గీయ రాజశేఖరరెడ్డి రాసిన లేఖ వల్లే కియా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ మరోపక్క అదే కంపెనీ గురించి విరుద్ధంగా మాట్లాడటం కియా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న కన్ఫ్యూషన్ ను సూచిస్తుంది.