megastar-chiranjeevi-pawab-kalyan-trivikram-srinivas-combinationsఒక్క మెగా అభిమానులే కాదు, సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి – పవన్ కళ్యాణ్ సినిమాను మరోసారి తెరపైకి తీసుకువచ్చారు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న షూటింగ్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను కలుసుకున్న తాను… ఈ ‘మెగా’ కాంభినేషన్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుందని చెప్పడానికి తానెంతో సంతోషిస్తున్నానని, ప్రస్తుతం చిరు, పవన్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు పూర్తి కాగానే తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ మూవీగా ఇది రూపుదిద్దుకోనుందని తిక్కవరపు ప్రకటించారు.

అంతకుముందు కూడా ఈ సినిమాకు సంబంధించి రెండు, మూడు సార్లు సుబ్బిరామిరెడ్డి అధికారికంగా ప్రకటించినా గానీ, అంతా లైట్ గా తీసుకున్నారు. అయితే తాను మాత్రం అలా తీసుకోలేదంటూ తాజాగా అప్ డేట్ ఇవ్వడంతో, నిజంగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందా? మెగా అభిమానుల కల ఫలిస్తుందా? అన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందో లేదో కూడా ఆ ప్రకటనలోనే స్పష్టంగా కనపడుతోంది. ప్రస్తుతం పవన్, చిరుల చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే ఈ కాంభినేషన్ మొదలవుతుందని ప్రకటించారు.

రాజకీయాలే లక్ష్యంగా ఎంచుకున్న పవన్ సంగతి కాసేపు పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఊయ్యాలవాడ నరసింహారెడ్డి”తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే సమ్మర్ ను టార్గెట్ చేసుకుని ఆగష్టులో ఈ సినిమా ప్రారంభం కానుంది. అంటే ఇక్కడ నుండి మరో ఏడాది పాటు, 2018 సమ్మర్ వరకు ఈ సినిమాతోనే చిరంజీవి బిజీగా ఉంటారన్నది తధ్యం. ఆ తర్వాతే మరేదైనా సినిమా! ఆ పై మరో ఏడాదిలో అంటే 2019లో ఏపీ, తెలంగాణాలతో పాటు పార్లమెంట్ కు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

దీంతో ఒక ఏడాదిలో ఎన్నికలకు వెళ్తూ, ‘జనసేన’ అధినేత సినిమాలు చేస్తారనుకోవడం భ్రమగానే భావించవచ్చు. అప్పుడు కూడా పార్టీపై దృష్టి పెట్టకుండా, సినిమాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ‘జనసేన’ డిపాజిట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అంతేగాక పవన్ చిత్తశుద్ధిని శంకించే విధంగా వ్యక్తిత్వం పైనే మచ్చ పడే అవకాశం ఉంది గనుక, మళ్ళీ సినిమాలు చేస్తారనుకోవడం పిచ్చి పనే అవుతుంది. అలాగే ఎంత కాదనుకున్నా, అధిష్టానం ఆదేశాల మేరకు మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ తరపున ప్రచారానికి బరిలోకి దిగాల్సి ఉంటుంది.

కనుక తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి చేయాలనుకుంటున్న ఈ ‘మెగా’ కాంభినేషన్ కార్యరూపం దాల్చేకన్నా, దానికి ఏదో రూపేణా అడ్డంకులు పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ ఈ జోడిని తెరపైకి తీసుకువస్తారా? అంటే అప్పటికీ 2020 చేరుకోవడం తధ్యం! ఇప్పటినుండి ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి ఉండడంతో… అప్పటికి రాజెవరో… రెడ్డెవరో… అన్న సూక్తి గుర్తు రాక మానదు.