Chiranjeevi Not suitable for politicsతెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి అన్న పేరు ఎప్పటికి చిరస్ధాయిగానే ఉంటుంది. నెంబర్ 1 స్థానంలో మెగాస్టార్ ఉన్నన్ని రోజులు మిగతా ఏ హీరో కూడా లేరు, బహుశా భవిష్యత్తులో అలాంటి అవకాశం కూడా లేదు. అలాగే ఒక్క పౌరాణికం తప్ప, సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ మెప్పించని క్యారెక్టర్ కూడా లేదు.

సినిమా ఇండస్ట్రీలో “ఎవరెస్టు” శిఖరంలో ఉన్న సమయంలోనే “ప్రజారాజ్యం” పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించిన చిరంజీవి, ఒక ప్రజానేతగా దారుణమైన వైఫల్యాన్ని చవిచూసిన వైనం ఎప్పటికీ జీర్ణించుకోలేనిదే. ఇదే సమయంలో రాజకీయాలను వదిలి మళ్ళీ సినిమా హీరోగా రీ ఎంట్రీ ఇస్తే, ప్రేక్షకులు మళ్ళీ నెత్తిన పెట్టుకున్న వైనం, బహుశా మరే ఇతర హీరోకు కూడా చెల్లుబాటు కాదేమో!

అంతలా సినీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న మెగాస్టార్, ప్రతి సినిమాకు పడే కష్టం గురించి తాజాగా “ఆచార్య” దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చారు. “సినిమా అంటే ఎంతో ఇష్టమని, మధ్యాహ్నం షాట్ ఉంటే పొద్దునే సెట్ కు వచ్చేస్తారని, 24 గంటలు సినిమా గురించే ఆలోచిస్తారని, షాట్ గ్యాప్ లో కూడా సినిమా గురించి తప్ప ఏ చెత్త, చెదారం గురించి మాట్లాడరని” మెగాస్టార్ గురించి చెప్పుకొచ్చారు.

చిరంజీవి చూపించే చిత్తశుద్ధికి కొరటాల చెప్పిన వ్యాఖ్యలు కొలమానం కాకపోయినా, ఒక సినిమాపై మెగాస్టార్ కున్న అమితమైన ఇష్టానికి నిదర్శనంగా నిలుస్తాయి. బహుశా అందుకే సినిమా రంగంలో అద్వితీయమైన విజయాలను మెగాస్టార్ సొంతం చేసుకున్నారు. ఇంతలా సినిమాలను ప్రేమించే మెగాస్టార్, మధ్యమధ్యలో రాజకీయాల్లోకి దూరి ఎందుకు అల్లరిపాలు కావడం అనేది మెగా అభిమానులను వేధించే ప్రశ్న.

‘ప్రజారాజ్యం’ ద్వారా విఫలమైన తర్వాత చాలాకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న తర్వాత, మీడియా ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే ఏపీ మూడు రాజధానుల అంశంలో స్పందించి ప్రజల దృష్టిలో చులకన అయిన విధానం అభిమానులకు జీర్ణించుకోలేని అంశం. అలాగే తదుపరి కూడా ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వాన్ని కొనియాడిన వైనం రాజకీయంగా ప్రతికూల పవనాలు ఎదురయ్యాయి.

సినిమాలను అంతగా ప్రేమించే మెగాస్టార్, రాజకీయ పరమైన అంశాలపై ఎందుకు స్పందించడం? దానికి మళ్ళీ విమర్శలను ఎదుర్కొవడం ఎందుకు? అందులోనూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ రూపంలో క్రియాశీలక రాజకీయాలలో ఉండగా, ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేయడం అనేది అభిమానుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ‘మెగాస్టార్’గా మా గుండెల్లో అపురూపంగా ఉంటే చాలు గానీ, అక్కరకు రాలేని పొలిటిక్స్ మనకెందుకు అనుకోవడం మెగా ఫ్యాన్స్ వంతు!