Bholaa Shankar5జి ప్రపంచంలో కంటెంటే కింగ్. ఇందులో అనుమానం అక్కర్లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాలు దక్కుతాయి. ప్రేక్షకులను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటే ఆచార్య, ఏజెంట్, ఆఫీసర్, శాకుంతలం లాంటివి వస్తాయి. ఇవన్నీ పెద్ద స్టార్లు చేసినవే. ఒక సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే దాని కథను ప్రొడక్షన్ ని బట్టి అంచనాల లెక్కల్లో మార్పులు వస్తున్నాయి. రీమేక్ అయితే ఒకలా స్ట్రెయిట్ సబ్జెక్ట్ అయితే ఇంకోలా ఉంటున్నాయి. ఆగస్ట్ 11న భోళా శంకర్ రాబోతోన్న విషయం అందరికీ తెలిసిందే.

అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా పట్ల స్వయానా ఫ్యాన్స్ లోనే నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెహర్ రమేష్ దర్శకుడు కావడం, తమిళంలో పరమ రొటీన్ కథతో తెరకెక్కి అజిత్ ఇమేజ్ ప్లస్ ఎలివేషన్ల పుణ్యమాని హిట్ అయిన వేదాళం రీమేక్ ని ఎంచుకోవడం ఇలా రకరకాల కారణాలున్నాయి. ఛలో తప్ప మరో బ్లాక్ బస్టర్ లేని మహతి స్వరసాగర్ కి సంగీతం అప్పగించారు. కీర్తి సురేష్ చెల్లి అనగానే రజనీకాంత్ పెద్దన్న గుర్తొస్తోంది. ఇవన్నీ సగటు అభిమానులను కలవరపెడుతున్న విషయాలే.

వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద హిట్ అయినా సంక్రాంతి సీజన్ ని వాడుకుని ఎక్కువ లాభపడిందన్నది వాస్తవం. ఓటిటిలో వచ్చాక దానికి సంబంధించిన ఊసులు లేకుండా పోయాయి. ఇప్పుడు భోళా శంకర్ ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా పెట్టుకుని వస్తోంది. రజనీకాంత్ జైలర్ ని 10నే దించుతున్నారు. మొన్నటిదాకా డౌట్ ఉండేది కానీ ఇప్పుడది అధికారికంగా క్లియరయ్యింది. రన్బీర్ కపూర్ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా కాంబోలో రూపొందిన యానిమల్ ఓ రేంజ్ హైప్ తో భోళా శంకర్ వచ్చే రోజునే దిగుతోంది. సన్నీ డియోల్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గదర్ కి సీక్వెల్ గతంలోనే ఆ డేట్ లాక్ చేసుకుంది.

గత ఏడాది గాడ్ ఫాదర్ కి ఎదురెళ్లి స్వాతిముత్యంని దింపిన నిర్మాత నాగవంశీ ఈసారి డీజే టిల్లు స్క్వేర్ ని నిలబెట్టే ఆలోచన సీరియస్ గా చేస్తున్నాడు ఇవన్నీ భోళా శంకర్ కు సవాల్ విసిరివే. చిరంజీవితో సిద్దు జొన్నలగడ్డతో పోలికేంటని కొందరంటారు. స్థాయిలో మార్కెట్ లో ఎవరూ పోల్చారు. కానీ ఓ ఇంటర్ కుర్రాడిని లేదా పాతికేళ్ల యువకుడిని నువ్వు ఈ రెండింటిలో ఏది చూస్తావంటే టిల్లు పేరే చెబుతాడు. సో అందరికీ తెలిసిన కథతో వస్తున్న భోళా శంకర్ తన చుట్టూ ఉన్న పోటీ పద్మవ్యూహాన్ని ఎదురుకోవడం అంత సులభంగా అయితే ఉండదు.