Chiranjeevi Meeting with Jagan Mohan Reddyగత కొంతకాలంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పాయింట్మెంట్ కోరుతోన్న మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు నేడు తాడేపల్లి నివాసంలో కలిసారు. దాదాపుగా గంటసేపు సాగిన భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను వివరించినట్లుగా, వాటి పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.

అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం త్వరలోనే వస్తుందని, అలాగే సినిమా టికెట్ ధరలపై కూడా మరో జీవో అతి త్వరలోనే అంటే మరో వారం పది రోజులలోపే రావచ్చన్న అభిప్రాయాన్ని మెగాస్టార్ వ్యక్తపరిచారు. జగన్ సతీమణి భారతి దగ్గరుండి భోజనం వడ్డించారని, మళ్ళీ మీరెప్పుడంటే అప్పుడు భోజనానికి వచ్చేయండన్నా అని జగన్ చెప్పినట్లుగా చిరు తెలిపారు.

“ఇండస్ట్రీ పెద్దగా కాదు, ఇండస్ట్రీ బిడ్డగా చెప్తున్నాను, నా మాటను మన్నించి అందరూ సంయమనంతో వ్యవహరించండి, ఏవేవో ఊహించుకుని ఆందోళనతో ఎవరూ నోరు జారవద్దు” అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఈ పది రోజుల్లో పాటించాల్సిన ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ను ఈ సందర్భంగా వెల్లడించారు చిరంజీవి.

గత రెండు రోజులుగా సినీ ఇండస్ట్రీ నుండి ఎన్వీ ప్రసాద్, తమ్మారెడ్డి వంటి పలువురు నోరెత్తి ‘వైసీపీ అండ్ కో’ను ఏకిపారేస్తున్న విషయం తెలిసిందే. వీటికి బ్రేక్ పడేలా మెగాస్టార్ తాజా వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. అయితే గతంలో దిల్ రాజు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఆ తర్వాత వైసీపీ నేతలు చేసిన ఘాటు వ్యాఖ్యలకు టాలీవుడ్ వర్గాలు కూడా అంతే ఘాటుగానే బదులిచ్చాయి.

తాజాగా “రౌడీ బాయ్స్” ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న దిల్ రాజు కూడా మరోసారి సినిమా టికెట్ ధరలపై స్పందిస్తూ… ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేవు కదా, కంగారేమీ లేదు, మరో రెండు నెలల్లో అంతా సెట్ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఇండస్ట్రీ వర్గాలను నోరు అదుపులో పెట్టుకోమని చిరంజీవి అయితే చెప్పారు, మరి ప్రభుత్వం నుండి తెలుగు సినీ వర్గాలపై నోరు పారేసుకోవద్దని కూడా ఏమైనా సూచనలు వెళ్ళాయా?