Chiranjeeviఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్దకు ఇండస్ట్రీ వర్గాలను తీసుకువెళ్లే బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారని, ఆ దిశగా టాలీవుడ్ ప్రస్తుత తరం హీరోలు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో చర్చలు జరిపి వారిని వెంట పెట్టుకుని తీసుకువెళ్తున్నారన్న ప్రచారం మీడియా వర్గాలలో జోరుగా సాగింది.

కానీ నేడు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉండడం విశేషం. బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న సమయంలో మీడియా వర్గాలన్నీ చిరంజీవిని చుట్టేసాయి. ఈ సందర్భంగా మీడియా వర్గాలు సంధించిన పాలు ప్రశ్నలకు సమాధానం అందించారు మెగాస్టార్.

తనతో పాటు ఎవరెవరు వస్తున్నారన్న విషయం తనకు తెలియదని, తనకు మాత్రం సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ఆహ్వానం అందిందని, తాను కూడా మీడియాలలో చూసే తెలుసుకున్నానని చెప్పారు చిరంజీవి. అలాగే సినీ ఇండస్ట్రీ చవిచూస్తోన్న సమస్యలకు ‘ఎండ్ కార్డు’ కాదు, ‘శుభం కార్డు’ పడుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా మెగాస్టార్ వ్యక్తపరిచారు.

ముఖ్యమంత్రితో భేటీ అయిన అనంతరం, అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని విషయాలు అందరం మాట్లాడతామని చెప్పారు చిరంజీవి. ‘ఎండ్ కార్డు’ లేక ‘శుభం కార్డు’ అన్న విషయం పక్కన పెడితే, మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, చిరు చెప్పిన మాటలకు ఎక్కడా పొంతన లేకపోవడం విస్తుపోయే అంశంగా మారింది. మరోవైపు మంత్రి కొడాలి నాని ఏమో, ఎవరైతే సీఎం అప్పాయింట్మెంట్ కోరారో వారు మాత్రమే వస్తున్నారని చెప్పారు.

ఇండస్ట్రీ బాధ్యతలను భుజానకెత్తుకుని అందరితో చర్చలు జరిపి, వారందరిని తన వెంట వచ్చేలా చేయడంలో చిరంజీవి కీలకపాత్ర పోషించారని మీడియా వర్గాలు గొంతెత్తి చెప్తుండగా, మరో వైపు చిరు ఏమో తన వెంట ఎవరు వస్తున్నారో కూడా తనకు తెలియదని చెప్పడం అనేది చూస్తుంటే, ఈ ఉదంతంలో చిరును బలిపశువు చేసే విధంగా ‘జగన్ అండ్ కో’ ప్రచారం చేయిస్తున్నారా? అన్న సందేహం అభిమానులలో వ్యక్తమవుతోంది.

బహుశా మెగాస్టార్ కు తెలుసో లేదో గానీ, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ‘ఆచార్య’ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డిలతో కూడిన 9 మంది బేగంపేట ఫ్లైట్ ఎక్కారు. నాగార్జున మాత్రం ఈ భేటీలో హాజరు కాకపోవడం విస్మయానికి గురి చేస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవుతారని ప్రచారం జరిగింది గానీ, తారక్ అయితే మిస్ అయ్యారు.