Deadline Ends for Chiranjeeviఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరిపిన అనంతరం బయటకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, “ఈ అంశంపై ఇంకా ఎవరూ నోరు జారవద్దు, అతి త్వరలోనే పాత జీవోను రద్దు చేసి, కొత్త జీవో సినిమా పరిశ్రమ అభీష్టాలకు అనుగుణంగా వస్తుంది, బహుశా ఓ వారం, పది రోజుల్లోనే రావొచ్చు” అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

జనవరి 13వ తేదీన జరిగిన సంఘటన ఇది. చిరంజీవి మాటకు కట్టుబడి సినీ ఇండస్ట్రీ నుండి ఏ ఒక్కరూ కూడా ఏపీ తీసుకున్న నిర్ణయంపై పల్లెత్తు మాట అనలేదు. ఇటీవల కాలంలో వివి వినాయక్ లాంటి ప్రముఖులు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భంలో కూడా ‘మెగాస్టార్ గారు టికెట్ ధరల విషయంపై మాట్లాడవద్దని చెప్పారు కాబట్టి, తాను మాట్లాడనని’ చెప్పుకొచ్చారు.

ఒక్క వినాయక్ మాత్రమే కాదు, ఇతర హీరోలు, దర్శకులు, నిర్మాతల పరిస్థితి కూడా అంతే. మెగాస్టార్ కు టాలీవుడ్ ఇచ్చిన గౌరవం అది. మరి ప్రభుత్వం నుండి ఇండస్ట్రీ ఆశించిన ప్రకటన వచ్చిందా? అంటే చిరు చెప్పిన వారం, పది రోజులు అయితే గడిచాయి గానీ, జగన్ సర్కార్ నుండి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు, కనీసం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా కనపడడం లేదు.

కమిటీ పేరుతో వైసీపీ సర్కార్ కాలాయాపన చేసే ఉద్దేశమే కనపడుతోంది. ఇప్పటివరకు రెండు సార్లు సమావేశాలు జరిపిన కమిటీ, ఆ సమావేశాలు, చర్చల యొక్క సారాంశాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. అంతేగాక ఎవరి ద్వారా కూడా చర్చల సారాంశం లీక్ అయినా, ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుందన్నట్లుగా సమాచారం.

దీంతో టాలీవుడ్ టికెట్ ధరల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని పరోక్షంగా సంకేతాలను పంపిస్తోంది. సంక్రాంతి సినిమాలన్నీ వాయిదాలు పడడంతో, ప్రస్తుతం సినిమాలేవీ లేక ఈ టికెట్ ధరల విషయం హైలైట్ కాకుండా ఉంది. అయితే కనీసం మళ్ళీ పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే టైంకైనా ఈ టికెట్ ధరల అంశం ఓ కొలిక్కి వస్తుందేమో చూడాలి.