Chiranjeevi And Ram Charan dance in Acharyaబాడీతో మ్యాజిక్ చేయడంలో మెగాస్టార్ దిట్ట. అదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్ చరణ్ కూడా అద్భుతంగా కాలు కదుపుతారు. అయితే వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఏముంది… ఇప్పటికే రెండు సార్లు నిరుత్సాహపడ్డాము, మరోసారి అలా కాకుండా ఉంటే చాలు అనుకోవడం అభిమానుల వంతు!

‘మగధీర’ సినిమాలో ‘బంగారు కోడిపెట్ట’ పాటలో చరణ్ తో కలిసి చిరంజీవి కనిపించబోతున్నారని ముందుగానే తెలియడంతో, సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లిపోతుందని భావించారు. కానీ నాటి మెగాస్టార్ బంగారు కోడిపెట్ట పాటలోని డ్యాన్స్ ను గ్రాఫిక్ లో చూపించడంతో అభిమానులు ఒకింత నిరుత్సాహపడ్డారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ అయిన “ఖైదీ నెంబర్ 150″లో చరణ్ కూడా ముఖ్య అతిథిలా ఓ పాటలో కనిపిస్తారన్న వార్తతో ఈ సారైనా ఇద్దరు కలిసి ఫుల్ లెంగ్త్ సాంగ్ చేసి ఉంటారని భావించగా, అది కాస్తా 20, 30 సెకన్లకే పరిమితం అయ్యింది. తాజాగా మరోసారి వీరిద్దరి కలిసి చేయబోయే పాట మెగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

త్వరలో చిరంజీవి – చరణ్ లు కలిసి డ్యాన్స్ చేసిన పాటను విడుదల చేయబోతున్నామని దర్శకుడు కొరటాల శివ చెప్పడంతో, మూడోసారి ముచ్చటగా ఈ తండ్రీకొడుకులు కలిసి కాలు కదపబోతున్నారని స్పష్టమైంది. దీంతో ఇంతకుమునుపు మాదిరే కొన్ని సెకన్ల పాటు మురిపిస్తారా? లేక పూర్తి స్థాయిలో మైమరిపిస్తారా? అని మెగా ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు.

అయితే ఇక్కడ “ఆర్ఆర్ఆర్” రూపంలో మరో చిక్కుముడి కూడా ఉంది. రామ్ చరణ్ – ఎన్టీఆర్ లు కలిసి డ్యాన్స్ చేసిన ఈ పాట వినడానికి ఎలా ఉన్నా, వీరిద్దరూ వేసిన స్టెప్స్ మాత్రం విజువల్ గా ప్రేక్షకులను ఒక ఊపు ఊపాయి. సోషల్ మీడియా అంతా ఈ ఇద్దరి స్టెప్ లతో నిండిపోయిన వైనం తెలిసిందే.

దీంతో రామ్ చరణ్ – చిరంజీవిలు చేయబోయే డ్యాన్స్ ను ఎన్టీఆర్ – చెర్రీ స్టెప్ లతో పోల్చి చూడడం చాలా సహజం. ఆ ఇద్దరి హీరోల డ్యాన్స్ బాగుందా? ఈ ఇద్దరి హీరోల డ్యాన్స్ బాగుందా? అన్న చర్చ అనివార్యం అవుతుంది. అదే జరిగితే మళ్ళీ “నందమూరి – మెగా” అన్న ‘డామినేషన్’ అంశం తెరపైకి వచ్చినట్లే!

‘సిద్ధా’ పరిచయ టీజర్ తర్వాత ఆకాశాన్ని తాకిన ‘ఆచార్య’ అంచనాలను రెట్టింపు చేసే విధంగా, మెగా అభిమానులకు కన్నులవిందుగా ఉండాలని ఆశిద్దాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాట రిలీజ్ తర్వాత, సినీ ప్రేక్షకలోకం అంతా ఎదురుచూస్తోన్న ధియేటిరికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా కొరటాల చెప్పారు.