Roja- AP Tourism Minister‘ప్రజారాజ్యం’ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి స్థానంలో ఉండాల్సిన చిరంజీవి, కాంగ్రెస్ పార్టీలో చేరి నామమాత్రపు ‘టూరిజం శాఖ’ మంత్రిగా విధులు నిర్వహించి, ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి, ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక టూరిజం శాఖా మంత్రిగా చిరంజీవి చేసిన సేవ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.

నాడు చిరంజీవి కేంద్ర టూరిజం మంత్రిగా వ్యవహరిస్తే, నేడు అదే పదవి రాష్ట్ర స్థాయిలో రోజాను వరించింది. తొలిసారిగా మంత్రి పదవి దక్కిన రోజాకు ఇది కేవలం నామమాత్రపు పదవిగానే మిగిలిపోనుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికే ఎవరూ దరి చేరడం లేదనే వార్తలు ప్రముఖ మీడియాలలో హెడ్ లైన్స్ గా ఉన్నాయి.

ఇక ఏపీ టూరిజం గురించి పట్టించుకున్న నాధులేరి? ఈ మూడేళ్లల్లో అసలు టూరిజం మంత్రి ఎవరో కూడా ఏపీ ప్రజలకు తెలియదని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి పదవికి ఇప్పుడు గుర్తింపు లభించిందంటే, అది రోజా వలనే! అంటే రోజాకు ఆ పదవి దక్కడం వలన పేరొచ్చింది తప్ప, ఆ పదవి వలన రోజాకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ ఉండేదేమో?!

ఒకవేళ ఈ రెండేళ్ళల్లో తన మార్క్ ప్రతిభను టూరిజం శాఖ ద్వారా జగన్ నేతృత్వంలో రోజా చూపిస్తారేమో వేచిచూడాలి. ఈ మూడేళ్లల్లో టూరిజంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు గనుక, ఇప్పటినుండి రాష్ట్రంలో టూరిజం ద్వారా ఎలాంటి అభివృద్ధి సాధించినా అది రోజా ఖాతాలోకే వెళ్తుంది. అయితే అంత అవకాశం, సదుపాయాలు ప్రస్తుత ప్రభుత్వంలో రోజాకు లభిస్తాయో? లేదో? వేచిచూడాలి.