mega-star-chiranjeevi-interview-on-pawan-kalyan-nagababu‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ వేడుక మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు మెగా సోదరుల పాలట సంచలనాత్మకమైన వేడుక అయ్యింది. ఒకటి… నాగబాబు వ్యక్తపరిచిన ఆవేదన కాగా, రెండవది పవన్ గైర్హాజరు విషయం. అయితే దీనిపై ఇంతకీ మెగాస్టార్ ఏమనుకుంటున్నారు? అంటే… నాగబాబు వ్యక్తపరిచింది నూటికి నూరు శాతం సరైన విషయమేనని సమర్ధించారు. నిజానికి తానూ కూడా వర్మ వ్యాఖ్యల పట్ల బాధపడ్డానని, అయితే వర్మ అలాంటి వ్యక్తిత్వం కలవారే కావడంతో తానూ లైట్ గా తీసుకున్నాను, నాగబాబు అలా తీసుకోలేకపోయాడని మెగా బ్రదర్ కు పూర్తి మద్దతు పలికారు.

అలాగే యండమూరి వీరేంద్రనాథ్ అంటే వ్యక్తిగతంగా నాగబాబుకు చాలా ఇష్టమని, కానీ బహిరంగ సభల్లో తన భార్య సురేఖను సైతం ఏకవచనంతో సంబోధిస్తూ సంస్కారహీనంగా మాట్లాడారని, నాగబాబు వందకు వంద శాతం వెనుకేసుకొచ్చారు. అయితే ఇక మున్ముందు ఈ అంశాలను మళ్ళీ నాగబాబు ప్రస్తావిస్తాడని తానూ అనుకోవడం లేదని, ఇక వారు చెప్తే అది వారి స్థాయికే వదిలేస్తున్నామని తెలిపారు. మరి ఇంతకీ ఈ వేడుకకు పవన్ హాజరు కాకపోవడం పట్ల మెగాస్టార్ ఏమన్నారో తెలుసా..?

నాగబాబును ఎంతగా సమర్ధించుకుంటూ వచ్చారో ఒక అన్నగా అదే స్థాయిలో పవన్ ను కూడా వెనుకేసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తొలినాళ్ళ నుండి అలాగే ఉన్నాడని, మేమంతా హాలులో కబుర్లు చెప్పుకుంటే, వాడు ఒంటరిగా బెడ్ రూమ్ లో పుస్తకాలు చదువుకునేవాడని, ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదని, అయితే పవన్ ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ అభిమానులు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, పవన్ బిజీగా ఉండడం వలనే ఈ వేడుకకు హాజరు కాలేకపోయాడని మెగాస్టార్ తెలిపారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో రాజకీయంగా పని చేసే అవకాశం లేదని, అయితే ఎప్పటికైనా పనిచేసే అవకాశం లేకపోలేదని, నాది, పవన్ ది దారులు వేరైనా గమ్యం ఒక్కటేనని అన్నారు. పవన్ ఆశయాలు బాగున్నాయని, మంచి ఐడియాలజీ ఉందని, నిజాయితీ గల మనిషి అని, ఉన్నత ఆశయం కోసం తన వంతు పని చేయాలని పవన్ భావిస్తున్నపుడు తప్పక ఆహ్వానించాలని పవన్ రాజకీయ జీవితాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అంతా బాగానే చెప్పారు గానీ, తన గమ్యం సిఎం పీఠం కాదు, అధికారం అంతకంటే కాదు అని పవన్ స్పష్టంగా చెప్పగా… మరి చిరు గమ్యం దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే కదా..?!