Mega family in janasena campaignబాబాయ్ పిలవాలే గానీ, మైక్ పట్టుకుని జనసేన తరపున ప్రచారం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధం అంటూ ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ తెలిసిందే. ఇక నాగబాబు విషయం అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనసేన తరపున బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే కుటుంబ సభ్యులను జనసేనలోకి తీసుకునే ప్లానింగ్ గానీ, వారిని పోటీకి దింపే అవకాశాలు గానీ, వారితో ప్రచారం చేయించే ఆలోచనలు గానీ పవన్ కళ్యాణ్ కు ఉన్నాయా? తాజాగా మీడియా వర్గాలు ఇదే ప్రశ్నను అడుగగా, పవన్ నుండి సమాధానం లభించింది.

‘ఎవరైనా స్వతహాగా వస్తే తన పార్టీలోకి ఆహ్వానిస్తానని, అంతతప్ప తన కుటుంబ సభ్యులను రమ్మని గానీ, ప్రచారం చేయమని గానీ అడగబోనని’ స్పష్టమైన వ్యాఖ్యలు చేసారు జనసేన అధినేత. ఒకవేళ పార్టీలోకి వస్తానని చెప్పినా, ఒకటికి పది సార్లు ఆలోచించుకోమని కోరుతానని, రాజకీయాల్లోకి రావడం అంటే చాలా నిబద్దతో కూడుకున్న వ్యవహారం అని, ఇష్టపడి రావాలి తప్ప బలవంతంగా తీసుకురాకూడదని, అయినా తన కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు, వారినెందుకు ఇబ్బంది పెట్టడం అని తాను భావిస్తానని, ఇంతకుమించి తానేమీ చెప్పలేనని మ్యాటర్ ను ముగించారు పవన్.

చూడబోతుంటే… ఆఖరి నిముషం ట్విస్ట్ లు తప్ప, ఇప్పట్లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ప్రత్యక్షంగా జనసేన తరపున ప్రచారానికి బరిలోకి దిగకపోవచ్చు. ఈ ఒక్క విషయంలో పవన్ ను మెచ్చుకోవాల్సిందే…. రాజకీయాల్లోకి ఇష్టపడి రావాలి తప్ప, తాను ఆహ్వానించడం జరగదని చెప్పడం, పవన్ ఆలోచనా తీరుకు అద్దం పడుతోంది. మొదటి నుండి కూడా పవన్ ఇదే స్టాండ్ పైన ఉండడం చెప్పుకోదగ్గ పరిణామం. ఇతర అంశాలలో మాట మార్చినట్లుగా పార్టీలోకి వచ్చేవారిపై మాట మార్చకపోవడం అనేది చూస్తుంటే… పార్టీలోకి ఎవరెవరిని తీసుకోవాలి అన్న దానిపై పవన్ కు క్లారిటీ ఉందని అర్ధమవుతోంది.