Meelo Evaru Koteeswarudu - Pradeep Chiranjeeviతెలుగు బుల్లితెర యాంకర్లలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా వెలుగొందుతున్న ప్రదీప్ మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘జబర్దస్త్’ యాంకర్ రష్మీతో కలిసి పాల్గొన్న ప్రదీప్… చిన్నప్పుడు పెళ్లికార్డుల్లో పెళ్లి కొడుకు పేరు ముందు చిరంజీవి అని వేసేవారని, పెళ్లి కార్డులో అది చూసి, ఈ పెళ్లి చిరంజీవి బంధువులదని, ఆ పెళ్లికి వెళ్తే చిరంజీవిని చూడొచ్చని ఆశపడేవాడినని తెలిపాడు.

అందుకు తగ్గట్లుగా బాగా తయారై పెళ్లిళ్లకు వెళ్లేవాడినని, అక్కడి చిన్న పిల్లలతో బాగా ఆడుకుని అలసిపోయి నిద్రపోయేవాడినని, పోన్లే మళ్లీ పెళ్లిలో చూడొచ్చని తనకు తాను సర్ది చెప్పుకునేవాడనని బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు. దీంతో చిరంజీవి ‘అయితే ఓ పని చేయండి… మీ పెళ్లి కార్డులో మీ పేరు ముందు చిరంజీవి అని అచ్చేయించుకోండి… తప్పకుండా వస్తాను’ అని మాట ఇచ్చారు.

‘పెళ్లికి వస్తానని నేను మాటిచ్చేశాను సరే… ఇంతకీ నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా?’ అని మెగాస్టార్ చమత్కరించడంతో షో అంతా నవ్వులమయం అయ్యింది. ఇంతలో దీంతో రష్మీ కలుగ జేసుకుని ‘సరైన పాయింట్ పట్టుకున్నారు సర్… అలా అడగండి’ అంటూ ఆట పట్టించింది. దీంతో ప్రదీప్… ‘తనకు అరేంజ్డ్ మేరేజ్ అంటే ఇష్టం అని, ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నారని, వాళ్లెవరిని ఎంపిక చేస్తే వారినే చేసుకుంటానని’ వెల్లడించాడు. అయితే ‘నా పెళ్లికి మీరు వస్తానన్నారు కాబట్టి… కొంచెం వేగంగా వెతకమని’ చెప్తానని ప్రదీప్ కూడా చమత్కరించారు.