Medical champ in mahesh babu burrepalemతన సొంతూరు బుర్రిపాలెం విచ్చేసిన సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ప్రిన్స్ మహేష్ బాబు, ముఖ్యంగా ‘హెల్త్ అండ్ ఎడ్యుకేషన్’ విభాగంలో తమ తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ గ్రామం నుండి ఆంధ్రా హాస్పిటల్ కు ఎవరు వెళ్ళినా, ఉచిత వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు జరిగాయని, ఇందు నిమిత్తం ఐడెంటిటీ కార్డులు కూడా మంజూరు చేయడం జరుగుతోందని, ఆ దిశగా తమకు సహకారం అందిస్తున్నందుకు ఆంధ్రా హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్తున్నట్లుగా ప్రకటించారు.

అలాగే తమకు మరింత సహకారం అందించేందుకు మెడికల్ కాలేజీ విద్యార్ధులు మరియు యంగ్ ఇండియా వాలేంటీర్స్ సంస్థ తరపున మరికొందరు వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంపులను నిర్వహిస్తారని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియగా తెలిపారు. అయితే ఇదంతా మహేష్ చెప్పి కనీసం ఓ 40 రోజులు గడుస్తోంది. మరి మహేష్ వచ్చేసిన తర్వాత కనీసం బుర్రిపాలెం మొహం ఎవరైనా చూసారా? గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ చెప్పిన పనులు ఒక్కటైనా సజావుగా సాగుతున్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం.

ప్రిన్స్ చెప్పిన ప్రణాళికల ప్రకారమే అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ‘హెల్త్ అండ్ ఎడ్యుకేషన్’కు సంబంధించిన కార్యక్రమాలు ఏ మాత్రం లోటు లేకుండా జరుగుతున్నాయని స్థానిక సభ్యుల సమాచారం. ఇటీవలే యంగ్ ఇండియా వాలేంటీర్స్ సంస్థ తరపున కొందరు మెడికల్ విద్యార్ధులు వచ్చి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి హెల్త్ సర్వేను నిర్వహించి, ఓ మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేసారు. అలాగే తన నాన్నమ్మ నిర్మించిన స్కూల్ కు సంబంధించిన ఆధునీకరణ కూడా జరుగుతోందని స్థానికంగా లభ్యమవుతున్న సమాచారం. మొత్తమ్మీద లేటుగా అయినా, బుర్రిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోవడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.