Media People Questioned Minister Ambati Rambabu About Polavaram Completionఆంధ్రప్రదేశ్‌ ప్రజల అదృష్టమో, దౌర్భాగ్యమో తెలీదు కానీ జలవనరుల ప్రాజెక్టుల గురించి ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నడూ మాట్లాడరు. కానీ ఎప్పుడూ తనదైన శైలిలో చమత్కారంగా మాట్లాడుతూ అందరినీ ఉల్లాసపరుస్తుంటారు.

పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమా తొందరపాటు, అనాలోచిత నిర్ణయాలే అని, కనుక పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేనని అలవోకగా తప్పించుకొన్నారు. అన్ని లక్షల కోట్లతో నిర్మించబడుతున్న ఒక జాతీయ ప్రాజెక్ట్ నిలిచిపోతే, మరొకరైతే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి ఉండేవారు. కనీసం ఆవేదన చెంది ఉండేవారు. కానీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం కులాసాగా జోకులు, సెటైర్లు వేస్తూ భలే జవాబు చెప్పానని మురిసిపోతున్నారు.

“పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తిచేస్తారు?” అని ట్విట్టర్‌లో జనసేన కార్యకర్తల ప్రశ్నకు “పవన్‌ కళ్యాణ్‌‌ నాలుగో పెళ్ళి చేసుకొనేలోగా,” అని మంత్రి అంబటి టక్కున జవాబు చెప్పేశారు. జలవనరుల శాఖకు మంత్రిగా ఉన్న ఆయన నుంచి అటువంటి సమాధానం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. బహుశః ఆ ప్రాజెక్టు గురించి నేటికీ ఆయనకు అవగాహన లేనందునే అటువంటి సమాధానం చెప్పి తప్పించుకొని ఉండవచ్చని ప్రజలు భావిస్తే తప్పులేదు.

అయితే ఆయన ఎంతో లౌక్యంగా సమాధానం చెప్పానని అనుకొంటే దాంతోనే విలేఖర్లు ఆయనతో చెడుగుడు ఆడేసుకోవడం విశేషం. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు, “పవన్‌ కళ్యాణ్‌ నాలుగో పెళ్ళి జరిగేలోగా పోలవరం కడతామని మీరు చెప్పారు. అంటే పోలవరం కట్టలేమని చెపుతున్నారా? ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ నాలుగో పెళ్ళి చేసుకోకపోతే పోలవరం ప్రాజెక్టు కడతారా కట్టరా?” అంటూ విలేఖరులు నిలదీశారు. దానికి మంత్రి అంబటి రాంబాబు మళ్ళీ గొప్పగా సమాధానం చెప్పబోయి “మీరందరూ జనసేన బ్యాచా?” అని అడిగేసరికి విలేఖరులు సహనం కోల్పోయి, “పోలవరం కడతారా లేదా?అని మేము అడుగుతుంటే దానికి మీరు సమాధానం చెప్పకుండా మమ్మల్ని జనసేన బ్యాచా?అని అడగడం ఏమిటి?” అంటూ నిలదీశారు.

దాంతో అంబటి రాంబాబు కంగు తిన్నారు. “అదికాదు తమ్ముడూ…” అంటూ తన మొబైల్ ఫోన్‌ బయటకి తీసి దానిలో జనసేన ట్వీట్ చూపిస్తూ నేను దానికి సమాధానం చెప్పాను,” అంటూ ఏదో సర్ది చెప్పుకోబోయారు. కానీ విలేఖరులు గుచ్చి గుచ్చి “పవన్‌ కళ్యాణ్‌ నాలుగో పెళ్ళి చేసుకోకపోతే మీరు పోలవరం ప్రాజెక్టు కడతారా కట్టరా? చెప్పండి,” అంటూ అంబటి రాంబాబుతో చెడుగుడు ఆడేసుకొన్నారు.