media ignored pawan kalyan janasena during elections 2019ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వడదెబ్బ తగిలిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో పవన్ కళ్యాణ్ కీలకమైన చివరి రోజులలో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ప్రచారం మొదలు పెట్టినా బాగా లిమిటెడ్ గానే ప్రచారం సాగించారు. ఆ సమయంలో ఆయన చేతికి ఉన్న సెలైన్ క్యాన్ ని జనసైనికులు బాగానే హైలెట్ చేసేవారు. దానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసి, సమాజం కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ అంటూ బాగానే పబ్లిసిటీ చేశారు.

అయితే సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి అక్కడ బానే పని అయ్యింది. కానీ అది అసలు ఓటర్లకు చేరలేకపోయింది. కారణం మీడియా ఆ విషయాన్నీ పెద్దగా పట్టించుకోకపోవడమే. గతంలో శ్రీ రెడ్డి వివాదం అప్పుడు పవన్ కళ్యాణ్ మీడియా మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అది మనసులో పెట్టుకుని మీడియా జనసేనను ఈ సారి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో నెంబర్ వన్ ఛానల్ ఐన టీవీ9 అయితే జనసేన అనే పార్టీ ఉందనే విషయమే మర్చిపోయినట్టు వ్యవహరించింది.

నర్సాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు, నేతల సమావేశంలో పాల్గొన్న నాగబాబు కూడా వడదెబ్బ ఎపిసోడ్ ని గుర్తు చేసుకున్నారు. తన తమ్ముడు స్పృహ తప్పి పడిపోయాడన్న వార్త తెలియగానే తాను ఆందోళనకు గురయ్యానని, ఆ టెన్షన్లో ప్రచారం కూడా సరిగా చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇదే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లో ఎవరికైనా జరిగితే దాన్ని ప్రచారం కోసం వాడుకుంటారని, కానీ తాము అలా చేయలేదని చెప్పుకొచ్చారు. నాగబాబు పైకి ఏమని చెప్పినా దానిని సరిగ్గా వాడుకోలేదు అనే బాధ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.