Meda Meeda Abbayi Hyper Aadi - Allari Nareshసక్సెస్ అందుకుని అయిదు సంవత్సరాలు గడవడంతో… ప్రస్తుతం ఖచ్చితంగా హిట్ అందుకోవాల్సిన పరిస్థితికి అల్లరి నరేష్ వచ్చేసాడు. ఓ పక్కన యువ హీరోలంతా కొత్తదనం ఎంచుకుని సక్సెస్ ల మీద సక్సెస్ లు కొడుతుంటే, నరేష్ మాత్రం ‘యావరేజ్’ మార్క్ ను కూడా అందుకోలేకపోతున్నాడు. గ్యారెంటీ సక్సెస్ వస్తుందని చాలా రీమేక్స్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోగా, మళ్ళీ అదే రీమేక్ తో “మేడ మీద అబ్బాయి” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ శుక్రవారం నాడు విడుదల కాబోతున్న ఈ సినిమా అయినా అల్లరోడు ముచ్చట తీరుస్తుందో లేదో గానీ, గట్టిగా సక్సెస్ కొట్టాలని బుల్లితెర సంచలనం ‘జబర్దస్త్’ ఫేం హైపర్ ఆదిని బాగా వాడుకున్నట్లుగా కనపడుతోంది. నిజానికి ఈ సినిమా హీరో ‘హైపర్ ఆది’నా? లేక అల్లరి నరేషా? అనేటంతగా ఈ సినిమా ప్రమోషన్స్ సాగుతున్నాయి. బుల్లితెరపై కట్ చేసి ప్రదర్శితమవుతున్న పబ్లిసిటీ టీజర్స్ అన్ని కూడా హైపర్ ఆది ‘పంచ్’ డైలాగ్ లతోనే నిండిపోవడం విశేషం.

అయితే సిల్వర్ స్క్రీన్ కు, స్మాల్ స్క్రీన్ కు ఉన్న తేడా ఇక్కడ ప్రస్పూటంగా కనపడుతోంది. బుల్లితెరపై హైపర్ ఆది ఏ పంచ్ పేల్చినా నవ్వుకునే ప్రేక్షకులకు, “మేడ మీద అబ్బాయి” సినిమాలో ఆది పంచ్ లు ఒకటి, రెండు మినహా పెద్దగా వర్కౌట్ అయినట్లుగా కనిపించడం లేదు. మరి వాటినే పబ్లిసిటీ చేయడం వెనుక చిత్ర యూనిట్ వ్యూహం ఏమిటన్నది ఈ నెల 8వ తేదీన తేలనుంది. ఏది ఏమైనా ఈ సినిమాతో అయినా అల్లరోడు గాడిలో పడి, ప్రేక్షకులందరినీ నవ్వుల వర్షంలో ముంచెత్తాలని మాత్రం కోరుకుందాం.