ఏపీలో "పేదరికం" అర్ధం మారిపోయిందిరయ్యో!ఒకప్పుడు పేదరికంకు కొలమానంగా రోజు వారీ ఆదాయాన్ని లెక్కించే వారు. లేదంటే మూడు పూటలా భుజిస్తున్నారా? లేదా? అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, అందుకు తగిన విధంగా ‘బీపీఎల్’ (బీలో పోవెర్టీ లైన్)ను నిర్ణయించేవారు. ఎప్పటినుంచో ఇదే అంశం ప్రామాణికంగా మారిపోయింది. కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మాత్రం సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.

2022 జనవరి 1వ తేదీ కొత్త ఏడాది సందర్భంగా ‘పేదరికం’కు సరికొత్త అర్ధం వచ్చేలా స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఎవరైతే ప్రభుత్వం అందిస్తోన్న తక్కువ ధరలో కనీసం సినిమాను కూడా చూడలేకపోతున్నారో, వారే అసలైన పేదవాళ్ళు అనే అర్ధం వచ్చేలా సీఎం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

ఏపీ సర్కార్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో కాలాన్ని గడుపుతున్నారు, ఒక్క సినిమాలను వీక్షించడంలో మాత్రమే ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి, వినోదాన్ని 5 రూపాయలకే తీసుకువచ్చిన గొప్ప ఆలోచనను సీఎం గారు ఎంత గర్వంగా చెప్పారో, ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఎంత ఆనందపడ్డారో అందరూ చూసారు.

ఏపీలో ప్రజలు పెట్రోల్, డీజిల్ వినియోగించడానికి గానీ
నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే సమయంలో గానీ
కరెంటు బిల్లులను చెల్లించే సమయంలో గానీ
గ్యాస్ బండలను బుక్ చేసినపుడు గానీ
ఆస్తి పన్నులను చెల్లించడానికి గానీ
చెత్త పన్నులను కట్టడానికి గానీ
రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు గానీ
బస్సు టికెట్లను తీసుకునేటప్పుడు గానీ

ఇలా ప్రజలు ఖర్చు చేసే ఏ ఒక్క అంశంలో కూడా వెనుకాడని పేదవాడు, సినిమా చూడడానికి వచ్చేపాటికి ఏపీలో 10 రూపాయలు కూడా ఖర్చు చేయలేని బీదరికంలో మునిగిపోయాడు. వీటిని దృష్టిలో పెట్టుకుని వినోదాన్ని అందివ్వాలని ఆదర్శప్రాయంగా నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలు సీఎంను ఎంతటి బాధకు గురిచేస్తున్నాయో నిన్నటి సభలో అందరికీ అర్ధమైంది.