హారర్ సినిమాలకు బేసిక్ గా రెండు మూడు టెంప్లేట్స్ ఉంటాయి. వాటిని దాటి కొత్తగా కథలు రాసుకోవడం రచయితలకు పెద్ద సవాల్. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇది మాములే. ఈవిల్ డెడ్ ఫస్ట్ పార్ట్ ని వెరెత్తిపోయి చూసిన జనం మూడో భాగాన్ని డిజాస్టర్ చేసి దానికి సెలవు కార్డు ఇప్పించారు. రాంగోపాల్ వర్మ భూత్ లాంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఆడియన్స్ ఆ సౌండ్ కి, సైలెంట్ గా భయపెట్టిన దెయ్యాల భీభత్సాలకు సూపర్ హిట్ కలెక్షన్లు ఇచ్చేశారు. మళ్ళీ మళ్ళీ అవే తీయడానికి ప్రయత్నిస్తే ఇక చాలని ఫ్లాపు చేసి పెట్టారు. జగపతిబాబు రక్ష దాక వర్మ ఇలాంటివి ఎన్నో తీశారో గుర్తు చేసుకోవడం కష్టం. అంతగా ఆ ఫార్ములా అరగేసి తిరగేసి బోర్ కొట్టించారు.
అన్నింటిలో ఉన్న కామన్ పాయింట్ ఒక అమ్మాయిని చనిపోయిన ఆత్మ ఆవహించడం, దాని వెనుకో ఫ్లాష్ బ్యాక్ పెట్టడం. ఇదే తరహాలో సాగుతుంది. ఆ మధ్య వచ్చిన సిద్దార్థ్ గృహం, నయనతార మయూరిలోనూ ఇదే ఉంటుంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా వచ్చిన మసూదలోనూ దీన్నే తీసుకున్నారు. కాకపోతే దర్శకుడు సాయికిరణ్ తెలివిగా ముస్లిం కుటుంబాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని కొత్తదనం జోడించాడు. టెక్నికల్ గా తన బ్రిలియన్స్ ని చాలా సన్నివేశాల్లో చూపించాడు. కాకపోతే గ్రిప్పింగ్ ఫ్యాక్టర్ తగ్గిపోవడంతో మసూద దర్శకుడిగా మంచి మార్కులే ఇస్తుంది కానీ రచయితగా మాత్రం పాస్ మార్కులే ఎక్కువ. సంగీతతో సహా ఏ యాక్టర్ నుంచి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే పెరఫార్మన్స్ అంటూ లేదు.
ఒకరకంగా చెప్పాలంటే కొన్నేళ్ల క్రితం ఎప్పుడైతే హారర్ జానర్ లో చిల్లర కామెడీని తీసుకొచ్చారో అప్పటి నుంచి ఆడియన్స్ లో దెయ్యాల పట్ల బొత్తిగా భయం పోయింది. ముఖ్యంగా జబర్దస్త్ రేంజ్ జోకులుతో లారెన్స్ దీన్ని ఎంత ఖంగాళీ చేయాలో అంతా చేశాడు. అదృష్టవశాత్తు కమర్షియల్ సక్సెస్ లు ఎక్కువ దక్కడంతో దాన్ని ఆపకుండా అలాగే సాగదీస్తూనే ఉన్నాడు. ఇతను తీసుకునేది కూడా దెయ్యాల ఆవాహన పాయింటే. మసూదలో వీటి జోలికి వెళ్లకపోవడమే పెద్ద రిలీఫ్. అలా అని అద్భుతంగా ఉందని చెప్పలేకపోయినా సెకండ్ హాఫ్ లో పరిగెత్తే కథనంతో కొంతవరకు మెప్పించగలిగాడు. ఇంకేదో మిస్ అయ్యిందనే ఫీలింగ్ మాత్రం తప్పించలేదు.
మనమూ తుంబాడ్ లాంటి క్రియేటివ్ ఆలోచనలు చేయాలి. 2018లో వచ్చిన ఈ మిస్టరీ కం హారర్ థ్రిల్లర్ జీరో అంచనాలతో వచ్చి థియేటర్ కొచ్చిన జనాన్ని మెస్మరైజ్ చేసింది. ఇందులో పైన చెప్పిన థీమ్ ఉండదు. పూర్తిగా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి మనిషి అత్యాశ ఎక్కడికి దారి తీస్తుందో చూపించే చిన్న మెసేజ్ టచ్ ఇచ్చి ఆద్యంతం స్క్రీన్ ప్లేతో అదరగొట్టారు. ఈ స్క్రిప్ట్ కి పదేళ్ల సమయం, 700 పేజీల స్టోరీ బోర్డ్ అవసరమయ్యిందంటే ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. మసూద లాంటివి ఆ దిశగా ఆలోచించాలి. అంత టైం తీసుకోలేకపోయినా ఆ స్థాయి టెంపోని సృష్టించగలగాలి. అప్పుడే మన హారర్ గురించీ దేశమంతా మాట్లాడుకుంటారు.