Mary Kom Recommended for Padma Vibhushan, PV Sindhu for Padma Bhushan ప్రపంచ క్రీడారంగంలో భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడిస్తున్న మేరీ కోమ్, పీవీ సింధులను అత్యున్నత పురస్కారాలకు క్రీడా మంత్రిత్వ శాఖ నామినేట్ చేసింది. బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్‌ను పద్మవిభూషణ్‌కు, బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన పీవీ సింధును పద్మభూషణ్‌కు ప్రతిపాదించింది. ఇటీవలే పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ను గెలిచి భారత కీర్తిపతాకానికి ఎగురవేసింది.

2015 లో పీవీ సింధును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇక 2017లో పద్మభూషణ్‌కు సింధు పేరును క్రీడాశాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆమెకు ఆ పురస్కారం దక్కలేదు. ఈ సంవత్సరం గారంటీ అంటున్నారు. మరోవైపు పద్మవిభూషణ్‌కు నామినేట్ అయిన తొలి క్రీడాకారిణిగా మేరీ కోమ్ రికార్డులకెక్కింది. 2013లో పద్మభూషణ్, 2006లో పద్మశ్రీ అవార్డులను మేరీ కోమ్ అందుకున్నారు.

మొత్తం తొమ్మిది మంది సిఫార్సు జాబితాలో ఉన్నారు. తొలిసారిగా క్రీడా శాఖ పూర్తిగా మహిళలతోనే సిఫార్సు జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది. క్రికెటర్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంఫాల్‌, రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనికా బాత్రా, షుటర్‌ సుమా శిరూర్‌, మౌంటెనీర్లు తాషి, సుంగ్లీ మాలిక్‌ పేర్ల ను పద్మశ్రీ కి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. దీనితో ఈ సారి పురస్కారాలు ఎవరు గెలిచినా భారత మహిళా శక్తిని చాటి చెప్పబోతున్నారు.