TDP MPs into well in rajya sabhaవిపక్షాల ఆందోళనలతో 21వ రోజు కూడా రాజ్యసభ ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే రేపటికి వాయిదా పడింది. తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌, అన్నాడీఎంకే సభ్యుల నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది. కావేరి బోర్డు ఏర్పాటు చెయ్యాలని అన్నాడీఎంకె సభ్యులు నిరసన చెయ్యగా, మిగిలిన పక్షాలు గొడవకు దిగాయి.

దీంతో తొలుత రాజ్యసభ ఛైర్మన్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను మధ్యాహ్నం ప్రారంభించగా.. అప్పటికీ సభ అదుపులోకి రాలేదు. దీంతో ఆయన శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కూడా తెదేపా సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.

వారు ఎంతకీ ఖాళీచేసి వెళ్లడానికి నిరాకరించడంతో మార్షల్స్ ను రప్పించి బలవంతంగా ఖాళీచేయించారు. మరోవైపు లోక్ సభ కూడా రేపటికి వాయిదా పడింది. రేపు ఇరు సభలు నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సమావేశాలలో అవిశ్వాసం చేప్పట్టకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది.