Marri Shashidhar Reddy resigned to congress party joining in BJPరాష్ట్ర విభజనతోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మాయం అయిపోయింది. సోనియా గాంధీ ఏపీ భవిష్యత్‌ని, ఏపీ కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినా అక్కడా కాంగ్రెస్ పార్టీ క్రమంగా కనుమరుగైపోతుండటం విశేషం. తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్‌ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తానని సోనియా గాంధీకి ఒట్టేసి చెప్పిన కేసీఆర్‌, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీనే టిఆర్ఎస్‌లో విలీనం చేసేకొన్నారు!

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను టిఆర్ఎస్‌లో చేర్చేసుకొని ఆ పార్టీని నిర్వీర్యం చేసేశారు. దానికి తోడు కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ తమలో తామే కీచులాడుకొంటూ చాలా బిజీగా ఉంటారు కనుక ఆవిదంగా కూడా తెలంగాణ కాంగ్రెస్‌ మరింత నిర్వీర్యం అయ్యింది.

రేవంత్‌ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టడంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ఎంత మేలు జరిగిందో అంతకంటే ఎక్కువే కీడు జరిగినట్లు కనబడుతోంది. పార్టీలో ఎంతో కాలం నుంచి ఉంటున్న తమను కాదని టిడిపి నుంచి వచ్చిన రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించినందుకు పార్టీలో సీనియర్ నేతలందరూ ఆయనకు సహాయ నిరాకరణ చేస్తుండటంతో ఆయన పరిస్థితి సైన్యం లేకుండా యుద్ధానికి బయలుదేరిన సైన్యాద్యక్షుడిలా మారింది. అందుకు మునుగోడు ఉపఎన్నికలే తాజా సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. తాను పార్టీ పగ్గాలు చేపడితే ఈవిదంగానే జరుగుతుందని రేవంత్‌ రెడ్డికి బాగా తెలిసి ఉన్నప్పటికీ ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి పార్టీ పగ్గాలు ఎందుకు చేపట్టారో ఆయనకే తెలియాలి.

ఏది ఏమైనప్పటికీ తెలంగాణ కాంగ్రెస్‌ పతనం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోతున్నట్లు ప్రకటించారు. పోతూ పోతూ… కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ మహమ్మారి సోకిందని, వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్‌ని ఇక ఎవరూ బ్రతికించలేరంటూ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్లు, పదవులూ అంతా డబ్బు వ్యవహారాలే తప్ప పార్టీ బాగోగులు ఎవరికీ పట్టవని, రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తాళం వేయకుండా విడిచిపెట్టారని మర్రి శశిధర్ రెడ్డి తన విలువైన అభిప్రాయాలు కక్కేసి ఈ శుక్ర లేదా శనివారంనాడు బిజెపిలో చేరిపోతున్నానని ప్రకటించేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కనబడకుండా చేయాలని టిఆర్ఎస్‌, బిజెపిలు కలిసి కుట్రలు చేస్తున్నాయని రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. తనని తాను ఓడించుకొన్నప్పుడే ఇతర పార్టీలు గెలుస్తుంటాయని నానుడి ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది.

మునుగోడు ఉపఎన్నికలు జరుగుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర తెలంగాణ గుండా సాగింది కానీ ఆయన అటువైపు తొంగి చూడకపోవడంతో మునుగోడులో పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. కనుక రాహుల్ గాంధీయే పట్టించుకొనప్పుడు రాష్ట్ర స్థాయి నేతలకు పార్టీని కాపాడుకోవాలనే ఆలోచన ఎందుకు ఉంటుంది?అయితే గియితే… జంప్ చేసేయడానికి బిజెపి ద్వారములు తెరిచేయున్నవి… అని మర్రి శశిధర్ రెడ్డి చెపుతున్నారుగా!