Marakathamani Poster YUPP tvఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన “మరకతమణి” సినిమా శుక్రవారం నాడు ధియేటర్లలో విడుదలైంది. క్రైమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను పూర్తి స్థాయిలో ప్రేక్షకులు సిల్వర్ స్క్రీన్ పై చూడకముందే అధికారికంగా చిత్ర యూనిట్టే వెబ్ ప్రపంచంలో విడుదల చేయబోతున్నారు. ‘యాప్ టీవీ’లో సోమవారం నాడు అఫీషియల్ గా సినిమాను విడుదల చేయబోతున్నామని ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ధృవీకరించారు.

సాధారణంగా ఇప్పుడు సినిమాలన్నీ మూడు రోజుల సినిమాలుగా మారిపోయాయి. అందులోనూ ‘టాక్’ తెచ్చుకోని సినిమాల పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారిపోయింది. ఇక పైరసీ బెడద ఎలాగూ నిత్యం ఉండనే ఉంది. ఈ నేపధ్యంలో… చిన్న సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయిన నేపధ్యంలో… కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టే విధంగా ‘మరకతమణి’ చిత్ర యూనిట్ ఆన్ లైన్ లో విడుదల చేస్తోంది.

మరి దీనిని ఉచితంగా అందిస్తారో లేక పెయిడ్ మూవీగా రిలీజ్ చేస్తారో చూడాలి. అయితే ఎలా అందించినా… అది మరుక్షణం పైరసీ రూపంలో మరో రకంగా విచ్చేయడం మాత్రం ఖాయం. దీంతో ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలను అందిస్తుందో వేచిచూడాలి. యాప్ టీవీ కాకుండా, యూ ట్యూబ్ లో అయితే చిత్ర యూనిట్ కు క్లిక్స్ ద్వారా ఆదాయం అయినా సమకూరి ఉండేదని టెక్ ప్రియులు అభిప్రాయ పడుతున్నారు.