Marakata_Ganapati_Idol_In_YCP_Leader_Houseప్రకాశం జిల్లా, యర్రగొండపాలెంలో వైసీపీ నేత మారం వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో గత శుక్రవారం రాత్రి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు చేసి అపురూపమైన మరకత పంచముఖ గణపతి విగ్రహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. సుమారు రెండున్నర అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు 90 కేజీల బరువు ఉండే ఈ మరకత గణపతి విగ్రహం ఖరీదు రూ.25 కోట్లు పైనే ఉంటుందని అంచనా.

ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యదర్శి రాజశేఖ రెడ్డి, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా చేస్తున్న ఆయన అల్లుడు ఇంద్రసేనారెడ్డి ఆ విగ్రహం కలిగి ఉండేందుకు న్యాయస్థానం ద్వారా హక్కులు పొందామని చెపుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆ విగ్రహాన్ని యర్రగొండపాలెంకు తీసుకువచ్చి వెంకటేశ్వర రెడ్డికి చెందిన ఓ షెడ్డులో దాచిపెట్టి దానిని అమ్మకానికి ప్రయత్నిస్తున్నారు. ఒంగోలు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఈ సమాచారం అందడంతో వారు సోదాలు చేసి మరకత విగ్రహాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

సాధారణంగా ఇటువంటి సందర్భాలలో అక్కడ లభించినవాటిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారు. కానీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకి వెంటనే పై అధికారుల నుంచి ఫోన్లు రావడంతో ఆ విగ్రహాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.

దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “వైసీపీ అధినేత రాష్ట్రంపైప‌డి ప్ర‌జాధ‌నం దోచుకుంటుంటే, వైసీపీ నేత‌లు ఊర్ల‌మీద ప‌డుతున్నారు. ఏమీ దొర‌క‌పోతే గుడీ, గుడిలో లింగ‌మూ దోచుకుంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డి అధికారం చేప‌ట్టిన నుంచీ వైసీపీ ముఠాలే హిందూ ఆల‌యాల‌పై దాడులు చేసి టిడిపిపై ఆరోప‌ణ‌లు చేశారు.

వైసీపీ కొల్ల‌గొట్టిన విగ్ర‌హాలలో ఒక‌టి ఇదిగో వైసీపీ నేత ఇంట్లో ఇలా మ‌ర‌కత‌ వినాయ‌కుడి రూపంలో బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌కాశం జిల్లాకి చెందిన ఛోటా వైసీపీ నేత వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి ఇంట్లో 25 కోట్ల విలువ‌చేసే మ‌ర‌క‌త విగ్ర‌హం బ‌య‌ట‌ప‌డిందంటే వైసీపీ పెద్ద నేత‌ల ఇళ్ల‌ల్లో ఇంకెన్ని పురాత‌న విగ్ర‌హాలున్నాయో?

ఇదే కాదు..రాష్ట్రంలో అన్ని దేవాల‌యాల్లోనూ వైసీపీ నేత‌లు న‌గ‌లు,విగ్ర‌హాలు ఎత్తుకుపోతున్నార‌ని భ‌క్తుల‌లో అనుమానాలున్నాయి. అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం, దుర్గ‌మ్మ వెండిసింహాల మాయం, రామ‌తీర్థం రాముడి త‌ల న‌రికివేత ఘ‌ట‌న‌లో ఈ రోజుకీ నిందితులు దొర‌క‌లేదు స‌రిక‌దా.. ఇదిగో వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డిలాంటి వైసీపీ నేత‌ల ద‌గ్గ‌ర విగ్ర‌హాలు దొరుకుతున్నాయి.

ఈ దొంగ ప్ర‌భుత్వం, దోపిడీ పాల‌కుల హ‌యాంలో ప్ర‌జ‌ల‌కే కాదు, దేవాల‌యాల ఆస్తుల‌కు, దేవ‌తావిగ్ర‌హాల‌కు ర‌క్ష‌ణ‌లేకుండా పోయింది. రాష్ట్రంలోని దేవాల‌యాలు అన్నింట్లో అర్జంటుగా కేంద్ర‌ బృందంతోగానీ, న్యాయ బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆడిట్ జ‌ర‌పాలి. లేదంటే దేవుళ్ల న‌గలు, విగ్ర‌హాలు వైసీపీ నేత‌లు పిల్ల‌ల మెడ‌లో ఆభ‌ర‌ణాలుగా మారే ప్ర‌మాదం ఉంది,” అని ట్వీట్ చేశారు.