Manmohan Singh Comments on Chandrababu Naiduమన దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన ఆర్ధిక మంత్రిగా మన్మోహన్ సింగ్ కు విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. బహుశా తను నిర్వర్తించిన ప్రధాని బాధ్యతల కంటే కూడా ఆర్దికమంత్రిగా అందించిన సేవలకు నిపుణులు ఇప్పటికీ ‘జై’ కొడతారు. అలాంటి ఈ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడుని అడిగి తెలుసుకున్నట్లుగా మీడియా వర్గాలలో వినపడుతున్న కధనాలు.

విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల గురించి ఆరా తీసిన సందర్భంగా… మిగులు బడ్జెట్ ఉంది కనుక తెలంగాణా గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పనిలేదు, అలాగే ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, వారు కూడా దిగులు పడాల్సిన పనిలేదు, రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయన్న నమ్మకాన్ని మన్మోహన్ సదరు రాజ్యసభ సభ్యుడి వద్ద ప్రస్తావించినట్లుగా ఈ కధనాల సారాంశం.

సహజంగా మౌనంగా ఉండే మన్మోహన్ తెలుగు రాష్ట్రాల గురించి ఆరా తీయడం, అందులోనూ తమ పార్టీకి ప్రతిపక్ష నేత అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై అపార విశ్వాసాన్ని వ్యక్తం చేయడమనేది మన్మోహన్ చిత్తశుద్ధికి, రాజకీయ పరిణితికి నిదర్శనంగా పేర్కొనాలా? అయితే న్యాయం చేయగలిగిన స్థానంలో ఉండి కూడా ఏపీకి అన్యాయం చేసిన ప్రధానిగా మన్మోహన్ చరిత్రలో నిలిచిపోతారు. వాస్తవ రూపంలో ప్రధానిగా విధులు నిర్వహించినది ఎవరైనా, పేరుకు ప్రధాని మన్మోహన్ అన్న విషయం తెలిసిందే.