manmadhudu-2-director-rahul-ravindran-chinmayi-controversy-with-kabir-singh-director-sandeep--vangaఎంకి పెళ్లి సుబ్బిశెట్టి చావుకు వచ్చినట్టు ఉంది మన్మథుడు 2 దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పరిస్థితి. ఇటీవలే దర్శకుడిగా అవతారం ఎత్తిన ఈ నటుడు తన మొదటి చిత్రం చిలసౌతో డీసెంట్ హిట్ కొట్టాడు. రెండో సినిమాకే నాగార్జున తో చేసే అవకాశం రావడం ఎలాగైనా దీనిని వాడుకుని పెద్ద హిట్ కొట్టాలని అతని ప్రయత్నం. అయితే రాహుల్ కు భార్యామణి చిన్మయి లేనిపోని ఇబ్బందులు తెస్తున్నది. మహిళల సమస్యల విషయంలో వేగంగా స్పందించే చిన్మయి తాజాగా కబీర్ సింగ్ మీద పడింది.

కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ వంగా నిన్న ఒక బాలీవుడ్ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం అవుతుంది. ప్రేమలో ఉన్న ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే వారి మధ్య నిజమైన ప్రేమ లేనట్టే అని ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుంది. దీనిపై చిన్మయి ఘాటుగానే స్పందించింది. మహిళలపై హింసను ప్రేరేపిస్తున్నారు అంటూ విరుచుకుపడింది. మహిళను కొడితే అది ప్రేమే కాదు అంటూ వాదిస్తుంది. ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది పక్కనపెడితే ఈ విషయంలో సందీప్ కు మద్దతు ఎక్కువగా ఉంది.

వారితో చిన్మయి సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే చేస్తుంది. వారు చిన్మయితో పాటు పనిలోపనిగా రాహుల్ ని కూడా ఏసుకుంటున్నారు. మన్మథుడు 2 ఆగష్టు 9న విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో ఇటువంటి రభస ఏంటో అని రాహుల్ తలపట్టుకుంటున్నాడు. అదే సమయంలో భార్యామణిని ఏమి అనలేని, ఆపలేని పరిస్థితి. మరోవైపు ఈ ప్రభావం మా సినిమా మీద పడకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు అక్కినేని అభిమానులు.