Manmadhudu 2 - Avanthika-అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘మన్మథుడు 2’ ఆగష్టు 9న విడుదల అవుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. లేటు వయసులో పెళ్లికి రెడీ అయిన ఒక అందగాడికి ఎదురయ్యే ఇబ్బందులు అక్కడి నుండి పెళ్లి అవసరం లేదు కాకపోతే అమ్మాయిలు కావాలి అంటూ చేసే హడావిడే మన్మథుడు 2 కథ. మొదటి టీజర్ విడుదల కాగానే దానిని చూసిన కొంత మంది ఈ సినిమా 2006లో వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమా కథ ను పోలి ఉందని అన్నారు.

‘ప్రేతే మొయి తా మై’ అనే ఆ సినిమాలో ఒక నలభై ఏళ్ల హీరో పెళ్లి చేసుకోమని ఇంట్లో అందరూ పోరు పెడుతుంటే ఒక అమ్మాయిని పెళ్ళాంగా అద్దెకు తెచ్చుకుంటాడు. అయితే దీని మీద సినిమా బృందం క్లారిఫికేషన్ ఇచ్చింది. ఈరోజు విడుదలైన రకుల్ ప్రీత్ సింగ్ టీజర్ లో ఆ ఫ్రెంచ్ సినిమాను నిర్మించిన స్టూడియో కెనాల్ లోగో కూడా టైటిల్స్ లో వేశారు. అంటే ఈ సినిమా ఆ ఫ్రెంచ్ సినిమా అధికారిక రీమేక్ అని చెప్పినట్టే. గత ఏడాది చిలసౌ వంటి మంచి సినిమాతో డైరెక్టర్ అవతారం ఎత్తిన రాహుల్ ర‌వీంద్ర‌న్‌ ఈ సినిమాకు దర్శకుడు.

అక్ష‌ర‌గౌడ‌, ర‌కుల్ ప్రీతి సింగ్, కీర్తి సురేష్ లాంటి భామలు నటిస్తున్నారు. నాగార్జున కోడలు సమంత కూడా చిన్న పాత్ర చేసిందట. 2016లో వచ్చిన ఊపిరి తరువాత నాగార్జునకు సరైన హిట్ లేదు. ఆ సినిమా తరువాత వచ్చిన ఐదు సినిమాలు ప్లాపులుగా మిగిలిపోయాయి. ఈ చిత్రంతో పాత బాకీ తీర్చాలని కసిగా ఉన్నాడు నాగ్. మరోవైపు ఆగష్టు 9 విడుదల అంటే ప్రభాస్ సాహో చిత్రానికి వారం గాప్ కూడా లేదు. ఇది ఒకరకంగా సాహసం అనే చెప్పుకోవాలి.