Mani-Sharmaఒకప్పుడు తెలుగు సంగీత ప్రపంచాన్ని ఏలిన మణిశర్మకు ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేని పరిస్థితి. మెలోడీ బ్రహ్మగా, బ్యాక్ గ్రౌండ్ కింగ్ గా టాలీవుడ్ లో మన్ననలు పొందిన మణిశర్మ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను, ఆవేదనలను వెలిబుచ్చారు. ముఖ్యంగా మహేష్ తో ఉన్న సాన్నిహిత్యం దూరం కావడం, ఆ తర్వాత ఇప్పటివరకు కలుసుకోకపోవడంపై మణిశర్మ మనసు విప్పి మాట్లాడారు.

మహేశ్ బాబు కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన సినిమాలకి వర్క్ చేస్తూ వచ్చాను. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. కానీ అనుకోకుండా ఎక్కడో చిన్న డిస్టబెన్స్ వచ్చింది. బహుశా ఆయన మనసు నొచ్చుకునేలా నేను మాట్లాడి ఉంటా. విషయమేమిటో తెలుసుకుందామంటే కుదరలేదు. ఆ తరువాత మేము ఎక్కడా కలుసుకోలేదు. పెద్ద హీరోలకి నేను చేసిన చివరి సినిమాల్లో ‘ఖలేజా’తో పాటు ‘శక్తి, తీన్ మార్’ వున్నాయి.

నేను బెస్ట్ మ్యూజిక్ ను ఇచ్చిన సినిమాల్లో ఇవి కూడా వున్నాయి. కానీ ఆ తరువాత వాళ్లెవరూ నా వంక చూడటం లేదు .. నా తప్పేమిటో నాకు అర్థం కావడం లేదంటూ ఆవేదన చెందారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. చిరంజీవి హీరోగా చేసిన ‘చూడాలని వుంది’ సినిమాలో ‘రామ్మా .. చిలకమ్మా’ అనే పాటను ఉదిత్ నారాయణ్ తో పాడించాను. చిరంజీవి ఈ పాట విని ‘రొంప పట్టిన వాయిస్ లా వుంది .. వద్దు’ అన్నారు.

కానీ యూనిట్ సభ్యులంతా ఈ సాంగ్ వైపే మొగ్గుచూపడంతో ఆ పాటను ఉంచేశారు. ఆ తరువాత చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ … ‘అప్పుడప్పుడూ జడ్జ్ మెంట్ విషయంలో పొరపాటు జరుగుతూ ఉంటుంది’ అని అన్నారు. ఇక ‘చిరుత’ సినిమాలో ‘ఓసోసి .. రాకాసి’ పాట విషయంలోను ఇలాగే జరిగింది. ఈ పాట టీమ్ లో ఎవరికీ నచ్చలేదు, డైరెక్టర్ కూడా ఆ పాటను తీసేద్దామన్నారు. చిరంజీవి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆ పాటలో కొత్తదనం ఉందని, ఆ పాట పట్ల చాలా కాన్ఫిడెంట్ గా వున్నానని ఒప్పించాను. సినిమా రిలీజ్ తరువాత ఆ పాటే అన్నిటి కన్నా పెద్ద హిట్ అయిందని అన్నారు. అయితే ఇప్పుడంతా ఇండస్ట్రీ హీరో ఓరియెంటెడ్ అయిపోయిందని, ఇప్పుడు హీరోలకి కావలసిందే సంగీత దర్శకుడు చేయాల్సి వస్తోందని, వీడు చెబితే మనం వినేదేంటి అనే ఫీలింగ్ ఎక్కువ మందిలో కనిపిస్తోంది. వాళ్లు చెప్పేది 50 .. 60 శాతం తప్పయినా అలాగే చేయాల్సిన పరిస్థితి వుందని చెప్పుకొచ్చారు.