Mangalampalli Balamuralikrishna Passed Away  Died‘బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే…’ అంటూ ఆయన పేరు ఎన్ని తెలుగు పాటలలో పలికారో లెక్కేలేదు. అలాంటి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కాలం చేసారు. 86 ఏళ్ళ బాలమురళీకృష్ణ చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1930 జూలై 6న తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తంలో జన్మించిన బాల… కర్ణాటక సంగీతంలో విద్వాంసుడిగా కీర్తి గడించారు.

వీణ, మృదంగం, కంజీరలు వాయించడంలో నిష్ణాతుడైన ఆయన, ఎన్నో సినిమాల్లో పాటలు పాడి అలరించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాళ్లు. కేవలం గాత్రదానం చేయడమే కాకుండా, స్వరకల్పన చేయడంలో కూడా దిట్ట. నటనలో ప్రావీణ్యత కూడా కలిగిన ఆయన, కేవలం 8 ఏళ్లకే కచేరీ చేయడం ద్వారా బాలమేధావిగా గుర్తింపు పొందారు. ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా సంగీత కచేరీలు చేసిన బాల, తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరి పీఠాలకు ఆస్థాన విద్వాంసుడిగా వ్యవహరించారు.

ఈయన మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఇక, బాలమురళీకృష్ణ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రముఖ దర్శకులు విశ్వనాథ్ తెలిపారు. మంగళంపల్లి మరణం తనకు తీరని లోటని, తమది అనుబంధం కాదని, బంధుత్వమని తీవ్ర విచారం వ్యక్తం చేసారు.

తామిద్దరం చిన్నతనంలో పెద్దగా కలుసుకోకపోయినా, విజయవాడలో కాపురమున్న రోజుల నుంచి మంచి స్నేహితులమని, ఈ మధ్యే ఆయనను కలిసినప్పటి నుంచి కాస్త ఆందోళనగానే ఉందని అన్నారు. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని, ఆయనతో పయనం మరచిపోలేని అనుభూతి అని, ఇది శరాఘాతం లాంటి వార్తగా అభివర్ణించారు. తెలుగు ప్రజలకు దుర్దినంగా ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి పేర్కొన్నారు.