manda krishna madiga viswarupa yatra from naravaari palleతెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వస్థలం అయినటువంటి చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, నారా వారి పల్లెలో బుధవారం సాయంత్రం నుండి పోలీసు ఆంక్షలు (పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్) అమల్లోకి వచ్చేశాయి. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు నేడు ఉదయం నుండి ఇంటింటిని సోదా చేస్తున్నాయి.

ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, నారావారిపల్లె నుండి ‘విశ్వరూప యాత్ర’ను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో… మందకృష్ణ మాదిగను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారమే అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరుకు తరలించారు. అయితే తమ నేత ఇచ్చిన పిలుపు మేరకు యాత్రను నిర్వహించి తీరుతామని ఎమ్మార్పీఎస్ నేతలు ప్రకటించారు.

ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు అప్పటికే గ్రామంలో ప్రవేశించి ఉంటారన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో నారా వారి పల్లెలో హై టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ముద్రగడ ‘కాపు ఉద్యమ’ ప్రభావంతో ఏపీలో కుల రాజకీయాలు ఊపందుకున్న నేపధ్యంలో జరుగుతున్న చర్యలు ఆందోళనను రేకేత్తిస్తున్నాయి.