Manchu Vishnu Luckunnodu-Trailer-Talkఇటీవల కాలంలో చాలా సెలక్టివ్ గా మంచు విష్ణు కధలను ఎంపిక చేసుకుంటున్నాడు. ‘ఓన్లీ ఎంటర్టైన్మెంట్’ అనే సూత్రానికి కట్టుబడి మాత్రమే సినిమాలు చేస్తున్న విష్ణు, తాజాగా ‘లక్కున్నోడు’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో విడుదలైన టీజర్ వీక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమాపై ప్రేక్షకులు ఓ కన్నేశారు. కానీ, ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

‘ఎంటర్టైన్మెంట్’ను సాగదీస్తే ఎంత విసుగు వస్తుందో, ఈ రెండు నిముషాల ట్రైలర్ చూడడానికే ప్రేక్షకులకు అంత విసుగు వస్తుంటే, రేపు ధియేటర్ లో పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ట్రైలర్ అంటే కనీసం ఓ రెండు నిముషాల పాటు ఉండాలన్న సూత్రాన్ని అవలంభించి కట్ చేసినట్లుగా ఉన్నారు తప్ప, ఈ కధను ప్రేక్షకులకు దగ్గర చేద్దామనే భావన ఈ “లక్కున్నోడు” ట్రైలర్ లో ఇసుమంత కూడా కనపడలేదు. ట్రైలర్ కటింగ్ ఎప్పుడూ షార్ప్ గా లేని పక్షంలో ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

బహుశా తమ లక్కీ హీరోయిన్ హన్సిక ఈ “లక్కున్నోడు”ను గట్తెక్కిస్తుందేమోనని భావిస్తున్నారేమో గానీ, గతంలో ‘బొద్దుగుమ్మ’గా ఉన్న ఈ బొమ్మ కాస్త చిక్కి, చక్కనమ్మలా తయారయ్యింది. రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. గతంలో వరుసగా వర్మ సినిమాలను నిర్మించిన సత్యనారాయణ, తాజాగా ఈ “లక్కున్నోడు” సినిమా ద్వారా రాబోతున్నారు. ప్రవీణ్ లక్కరాజు, అచ్చు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే… ప్రేక్షకులను ధియేటర్ల వైపుకు నడిపించేదిగా ఈ ట్రైలర్ కనపడడం లేదు.