Vishnu-Manchu Comments on G.Osసినిమా టికెట్ ధరల అంశం హాట్ టాపిక్ గా మారిన తర్వాత తొలిసారిగా మీడియా కంట పడిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణును అనేక రకాల ప్రశ్నలు చుట్టుముట్టాయి. ముందుగా టికెట్ ధరల అంశంపై ఆచితూచి స్పందించిన మంచు విష్ణు, ఆ తర్వాత జీవోల ప్రస్తావన తీసుకువచ్చారు.

ఓ రాష్ట్రంలో టికెట్ ధరలు పెరిగాయి, కోర్టుకు వెళ్లారు, అలాగే మరో రాష్ట్రంలో టికెట్ ధరలు తగ్గించారు, కోర్టుకు వెళ్లారు. ఈ సమస్యపై మేము, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడూ చర్చలు జరుపుతున్నామని, నాకు వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు గానీ, ప్రస్తుతం తాను ఉన్న పదవిలో ఉండి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు.

ఎవరి స్వలాభం కోసమో ఎవరికి వాళ్ళు కామెంట్స్ చేయడం సమంజసం కాదని, మేమంతా ఒక్క అభిప్రాయం వ్యక్తం చేయాలని అన్న మంచు విష్ణు, ఇటీవల జరిగిన మెగాస్టార్ చిరంజీవి – ఏపీ సీఎం జగన్ ల భేటీ పూర్తి వ్యక్తిగతమైన సమావేశంగా తేల్చారు. అయితే ఇండస్ట్రీ కోసం చిరంజీవి గారితో పాటు నాన్న గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారన్న భావనను వ్యక్తపరిచారు.

టికెట్ ధరల అంశం గురించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే చెప్పాలని, నేను వ్యక్తిగతంగా చెప్తే అది పక్కదారి పడుతుందని అన్న, మంచు విష్ణు 2007లో స్వర్గీయ దాసరి నారాయణరావు గారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నుండి ఓ జీవో తీసుకువచ్చారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కరెక్ట్ గా ఓ నలుగురు కోసం ఆ జీవోను రద్దు చేసి, కొత్త జీవోను తెచ్చారు, ఆ జీవోల గురించి మాట్లాడండి అంటూ మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు.

అయితే ఆ జీవోలు కొద్దిగా అర్ధం అయ్యే విధంగా చెప్పాలని మంచు విష్ణును తిరిగి మీడియా ప్రతినిధులు అడగగా, దానికి నవ్వుతూ “అది మీ ఉద్యోగం, నాది కాదు” అంటూ వెళ్లిపోయారు. పాత జీవోల గురించి అర్ధం కాక వెళ్లిపోయారో లేక మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు తాళలేక వెళ్లిపోయారో గానీ, పాత జీవోల అంశాన్ని హాట్ టాపిక్ చేస్తూ ప్రస్తుత జీవో అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా మంచు విష్ణు వ్యాఖ్యానించారు.