'ఆహా'కు 'మంచిరోజులు వచ్చాయి!'ఒక ప్రాంతీయ భాషలో ఓటీటీ ప్రారంభించి, విజయవంతమైన సంస్థగా “ఆహా” ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ‘ఆహా 2.0’గా అప్ డేట్ అయిన తర్వాత ఈ దూకుడు మరింత ఎక్కువయ్యింది. ప్రతి వారం ఖచ్చితంగా ఓ సరికొత్త సినిమాతో పాటు బాలయ్య ‘అన్ స్టాపబుల్,’ అలాగే శ్రీముఖి వంటి హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్స్ చెఫ్ కార్యక్రమాలతో ప్రస్తుతం ‘ఆహా 2.0’ కళకళలాడిపోతోంది.

ఈ క్రమంలోనే ఈ శుక్రవారం నాడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు “మంచిరోజులు వచ్చాయి” సినిమాను తీసుకువచ్చారు. నవంబర్ 4వ తేదీన ధియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాను కేవలం నెల రోజుల లోపునే (డిసెంబర్ 3వ తేదీ నుండే) ‘ఆహా’ ప్రేక్షకులకు అందించడం విశేషం. ప్రముఖ దర్శకుడు మారుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘ఫ్యామిలీ ఎంటర్ టైనర్’గా కితాబు అందుకుంది.

‘ఏక్ మినీ కధ’ సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందిన సంతోష్ శోభన్ హీరోగా నటించగా, మిల్కీ స్కిన్ టోన్ బ్యూటీ మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అజయ్ ఘోష్ చాలా కీలకమైన పాత్రను పోషించారు. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ కు ఎంత ప్రాధాన్యత ఉందో, ఓటీటీ ప్లాట్ ఫామ్ కు కూడా అంతే ప్రాధాన్యత దక్కించుకుంది. ముఖ్యంగా లో-బడ్జెట్ సినిమాలకు ‘ఆహా’ వంటి ఓటీటీలే ప్రధాన ఆదాయ వనరులుగా మారిపోయాయి.