AP Special: Man Gets Police Notice For Fixing Roads‘అమ్మ అన్నం పెట్టదు… మరొకరిని పెట్టనీయదు’ అనే నానుడి అందరికీ తెలిసిందే. దానిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు అన్నా క్యాంటీన్లు పెట్టి నిరుపేదలకు అన్నదానం చేస్తుంటే, స్థానిక వైసీపీ నేతల ఒత్తిళ్ళకు తలొగ్గి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వాటిని అడ్డుకోవడం, వారిపై కేసులు నమోదు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు గుంతలు పడిన రోడ్డును సొంత ఖర్చుతో పూడ్చినా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు! ఈ ఘటన కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో జరిగింది.

ఇటీవల స్థానిక టిడిపి సీనియర్ నేత నంబూరి వెంకట రామరాజు (తాడినాడ బాబు) ఊర్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత లెక్కలు చూడగా సుమారు రూ.2.50 లక్షలు నగదు మిగిలింది. దాంతో ఏమి చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ ఆలోచించిన తర్వాత తాడినాడ-చినతాడినడ మద్య రోడ్డు పూర్తిగా గుంతలు పడి ద్విచక్రవాహనాలు కూడా ప్రయాణించలేని స్థితిలో ఉందని గుర్తించి ఆ సొమ్ముతో ఆ రోడ్డుమీద గుంతలనీ పూడ్చేశారు. అప్పటి నుంచి ఊరి ప్రజలు హాయిగా ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. చాలా మంచి పనిచేశారని అందరూ తాడినాడ బాబును మెచ్చుకొంటున్నారు.

ఇది స్థానిక వైసీపీ నేతలకి అభ్యంతరకరంగా కనిపించింది. వారి ఫిర్యాదు మేరకు ఆర్‌ అండ్ బి అధికారులు రోడ్డును పరిశీలించి, తమ అనుమతి తీసుకోకుండా గుంతలను పూడ్చేసినందుకు తాడినాడ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కైకలూరు సీఐ వైవిఎల్ నాయుడు కేసు నమోదు చేసి ఆయనకు నోటీస్ పంపించారు. ఈ కేసులో విచారణ నిమిత్తం కలిదిండి పోలీస్ స్టేషన్‌కు రావలసిందిగా నోటీసులో కోరారు.