Mallela Lingareddy comments on jagan governmentకడప పార్లమెంట్‌ నియోజకవర్గ టిడిపి అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి సోమవారం ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వానికి కమీషన్ల కక్కుర్తి చాలా పెరిగిపోయింది. ఇంతకు ముందు 108 వాహనాలు, బియ్యం డోర్ డెలివరీ వాహనాల కొనుగోలులో వైసీపీ నేతలు కమీషన్లు నొక్కేశారు. జగన్ ప్రభుత్వం ఇప్పుడు చెత్త సేకరణ కోసం అంటూ ఉన్న వాహనాలను మూలనపడేసి కమీషన్ల కోసమే 2,675 ఆటోలు కొనుగోలు చేసింది.

ఎన్నడూ లేనివిదంగా ప్రజల ముక్కు పిండి భారీగా చెత్తపన్ను వసూలు చేస్తోంది. నిజానికి ఆస్తి పన్నులోనే పారిశుద్య నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. గ్రామాలలో పంచాయతీలు, పట్టణాలలో మున్సిపాలిటీలు, నగరాలలో కార్పొరేషన్లదే పారిశుద్య బాధ్యత. కానీ జగన్ ప్రభుత్వం ఓ వైపు ఆస్తిపన్ను పెంచేస్తూనే మళ్ళీ ప్రజల నుంచి చెత్తపన్ను అదనంగా వసూలు చేస్తోంది. అయినా ఎక్కడ చూసినా పందులు, చెత్తకుప్పలే కనిపిస్తుంటాయి. చెత్త నుంచి కూడా కమీషన్లు, పన్నులు పిండుకోవాలని చూస్తున్న చెత్త ప్రభుత్వం ఇది. దీనిని గద్దె దించినప్పుడే ప్రజలకు ఈ అదనపు భారం నుంచి విముక్తి లభిస్తుంది,” అని అన్నారు.

ఈ మీడియా సమావేశంలో టిడిపి కడప పార్లమెంట్‌ నియోజకవర్గం కార్య నిర్వాహక కార్యదర్శి శానా విజయభాస్కర్ రెడ్డి, టిడిపి కార్యదర్శి సిద్దయ్య, టిడిపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సుబ్బరాజు, మాజీ కౌన్సిలర్ సీతారామిరెడ్డి తదితర టిడిపి నేతలు పాల్గొన్నారు.