malladi vishnu arrested 144 section in vijayawadaవిజయవాడలో కృష్ణలంక ప్రాంతంలో కొలువు తీరిన స్వర్ణ బార్ వేదికగా వెలుగు చూసిన కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మరియు ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్ లను గురువారం రాత్రి 11 గంటల సమయంలో సిట్ పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్టేషన్‌కు తరలించారు. సిట్ విచారణలో విష్ణు ఇచ్చిన సమాధానాలకు, బార్ సిబ్బంది చెప్పిన జవాబులకు పొంతన లేకపోవడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఐదుగురు మరణించగా, 25 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

విచారణ పేరిట రెండు రోజుల పాటు సిట్ పోలీసులు విష్ణును దాదాపు 25 గంటల పాటు విచారించారు. సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైతే, అరెస్ట్ ఉండదన్న కోర్టు వ్యాఖ్యలతో నాలుగు రోజుల క్రితం తన నెల రోజుల అజ్ఞాతవాసాన్ని వీడారు. మొన్న, నిన్న ఆయన సిట్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, అరెస్ట్ ఉండబోదని భావించిన వారికి షాకిస్తూ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మల్లాది సోదరులను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించడంతో నవ్యాంధ్ర పొలిటికల్ రాజధాని విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

మాస్ లీడర్ గా పేరున్న మల్లాది విష్ణు అరెస్ట్ తో నగరంలో అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావించడంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల కింద పోలీసులు నగర వ్యాప్తంగా 144 సెక్షన్ ఆంక్షలను విధించి, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించారు.

ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతోనే మల్లాది విష్ణును అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. మల్లాది అరెస్ట్ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాలతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.