malladi vishnu fake liquor deathsవిజయవాడ, కృష్ణలంక స్వర్ణ బార్ లో జరిగిన కల్తీ మద్యం కేసు ఓ కొలిక్కి వస్తోంది. మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాసరావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. అలాగే అదుపులో ఉన్నటువంటి క్యాషియర్ వెంకటేశ్వరరావును తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా ‘సిట్’ అధికారులు కోర్టును కోరగా, ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ వరకు ముందుగా అదుపులోకి తీసుకున్నటువంటి బార్ సిబ్బందిని విచారణ చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదిలా ఉంటే, ఈ కేసులో ఏ-9గా ఉన్నటువంటి మాజీ కాంగ్రెస్ శాసన సభ్యుడు మల్లాది విష్ణును అదుపులోకి తీసుకోవాల్సిందిగా విజయవాడ పోలీస్ కమీషనర్ ఆదేశాలు జారీ చేసారు. పోలీసుల విచారణలో మల్లాది విష్ణు పాత్ర కూడా బలంగా ఉందని తేలడం మరియు దానికి సంబంధించి పక్కా ఆధారాలు లభ్యం కావడంతో అరెస్ట్ కు రంగం సిద్ధం చేసారు. అయితే ఈ కేసుతో గానీ, ఆ బార్ తో గానీ తనకు ఎటువంటి సంబంధం లేదని, సదరు వ్యవహారాలన్నీ సోదరుడే చూసుకుంటున్నారని చెప్పిన మల్లాది విష్ణు, మూడు రోజుల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.

దీంతో పోలీసు వర్గాలకు అనుకోని ‘ట్విస్ట్’ ఎదురయ్యింది. టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ బృందాలు విష్ణు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్, కటక్ లలో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసు వర్గాలు, నాలుగు బృందాలను రంగంలోకి దింపారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండగా, సిగ్నల్ వ్యవస్థ ఆధారంగానైనా కనిపెట్టి తీరుతామని, ఏ క్షణంలోనైనా మల్లాది విష్ణును అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు.

పరారీలో ఉన్న మల్లాది విష్ణుపై స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఘటన జరిగిన నాటి నుండి విష్ణుపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న స్థానిక ప్రజలు… సంఘటన జరిగే ముందు రోజు అర్ధ రాత్రి సమయంలో రెండు లారీల సరుకు దిగిందని, బహుశా అందులోనే మద్యం కల్తీ చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. కల్తీ జరిగినట్లుగా మల్లాది శ్రీనివాసరావు అంగీకరించడంతో మల్లాది విష్ణు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.