#MaheshBabu sponsored Vaccination for Burripalem మంచి పనులు ఎవరు చేసినా మెచ్చుకోవాలంటారు పెద్దలు. అయితే టాలీవుడ్ ఫ్యాన్ వార్స్ లో మాత్రం కనీసం ఆ మాట మీద సోయ ఉండదు. కరోనా కష్టకాలంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు పెట్టి…. కరోనా బాధితులను ఆదుకుంటున్నారు. మరోవైపు నటుడు సోను సూద్ దేశానికీ ఈ విపత్తు సమయంలో చేస్తున్న మంచి గురించి తెలిసిందే.

అయితే సోను సూద్ లా చిరంజీవి ఎంతో చెయ్యొచ్చని ఆయన కొంతవరకే పరిమితం అయిపోతున్నారని…. కొందరి ఆక్షేపణ. కొందరు చిరంజీవి అభిమానులేమో సోను సూద్ కంటే తమ హీరోనే గొప్ప… పరాయిభాష వాడిని పొగిడి మనవాడిని తక్కువ చేస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఇరువైపుల వారిదీ ఉన్మాదమే.

ఇక ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు ఆయన స్వగ్రామం బుర్రిపాలెంలోని ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మహేష్ ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి… కొందరు వంకలు పెడుతున్నారు. ఒక్క రోజులో ఊరి మొత్తానికి వాక్సిన్ ఎలా వేస్తారు?

ఒక్క రోజు వేస్తే ఎలా సరిపోతుంది? మొదటి డోసు ఇస్తారు సరే మరి సెకండ్ డోస్ పరిస్థితి ఏమిటి అంటూ వంకలు పెడుతున్నారు ఇంకొందరు. దానితో ఈ ప్రక్రియ వారం పాటు జరగనుందని… వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న అందరికీ ఇస్తామని… అలాగే ఈ క్యాంపు లో మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి రెండవ డోసు ఏర్పాట్లు కూడా మహేష్ బాబే ఉచితంగా ఏర్పాటు చెయ్యనున్నారని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. మంచి పనులలో కూడా ఇలా కొర్రీలు పెడితే ఇంకేమనాలి?