Mahesh Kaththi  comments Pawan Kalyan!‘బిగ్ బాస్’ షో ముందు వరకు బహుశా సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరి వరకే తెలిసిన పేరు మహేష్ కత్తి. కానీ ‘బిగ్ బాస్’ హౌస్ లోకి అడుగుపెట్టి, ఎలిమినేట్ అయిన తర్వాత పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు ఈ మహేష్ కత్తి. అందుకే ప్రస్తుతం ఈ ‘కత్తి’ ఏం చెప్పినా అవి సెన్సేషన్ గా మారుతున్నాయి. సెలబ్రిటీ హోదాలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ వ్యవహారశైలిపై ఏకిపారేయడంతో పాటు అభిమానం పేరుతో మెగా ఫ్యాన్స్ చేస్తోన్న వ్యవహారాలపై సందేహాలు వ్యక్తపరిచారు.

‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కేవలం ట్వీట్స్ కు, బహిరంగ సభలకే పరిమితం అవుతున్నారు తప్ప ఏం చేస్తున్నారు? అని తాను ప్రశ్నించిన విధానానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, అందులో తనకేమి తప్పు కనపడలేదని, ఒకవేళ తనది తప్పు అంటే దానికి కారణాలు చెప్పాలి కదా… అంతకుమించి పవన్ ఏం చేసారో నాకు చెప్పండి… అంటూ బదులిచ్చారు. సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తున్నారో… ఓ రకంగా ఆయన రాసిన దాని కంటే ఎక్కువే నా ఫేస్ బుక్ లో రాస్తున్నాను… అయితే ఏంటి… నన్ను సిఎంను చేసేస్తారా? అంటూ ప్రశ్నించారు.

విశాఖలో ‘ప్రత్యేక హోదా’ ఉద్యమం పిలుపునిచ్చిన సమయంలో తాను తన సొంత డబ్బులతో ఫ్లైట్ లో విశాఖ వెళ్లాను, పవన్ కేవలం ట్విట్టర్లో సపోర్ట్ చేసారు అంటూ ఓ విధంగా పవన్ కంటే తానే మెరుగన్న భావనను వ్యక్తపరిచారు. ఇప్పటివరకు కేవలం మాటల్లోనే ఉన్నారు, చేతల్లోకి దిగలేదు, ఒక రోజు చెప్పిన మాటలకు రెండో రోజు చెప్పిన మాటలకే పొంతన ఉండడం లేదు, ఓ విధంగా అతని మాటలను అతనే నమ్మడం లేదు, అలాంటప్పుడు ఆయన్ని లీడర్ గా ఎందుకు నమ్మాలి… నా ప్రశ్నలలో లాజిక్ ఉంది కదా… అంటూ ‘జనసేన’ అధినేత విధానాలను ప్రశ్నించారు.

ఒకవేళ తాను ఏ సమస్యపై స్పందించకుండా ఉంటే, బహుశా నేను చేయనిది అతను చేస్తున్నాడు కదా అని సైలెంట్ గా ఉండేవాడినేమో… అలా కాకుండా పవన్ మాదిరే నేను స్పందిస్తున్నాను కదా… మరి నాకు, పవన్ కు తేడా ఏంటి? అంటూ సూటిగా ప్రశ్నించారు. గత ఎన్నికలలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చాను అనే భ్రమలో ఉన్న పవన్ చేయాల్సింది ఏమిటి? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? వాజ్ పేయితో ఎందుకు మీటింగ్ పెట్టలేదు? ఇవన్నీ అడగడం తప్పా? రాజ్యాంగం ప్రకారం నాకు హక్కులు లేవా? ప్రజలలో నేను ఒకడిని కాదా? అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు.

ఎలా అయితే తాను ప్రశ్నిస్తాను అని పవన్ వస్తున్నాడో, నేను కూడా అలాగే అతన్ని ప్రశ్నిస్తున్నాను… సమాధానాలు ఇవ్వమని చెప్పండి… అతనిది తప్పు కానప్పుడు నాది తప్పు ఎలా అవుతుంది? ఒక రాజకీయ పార్టీ పెట్టినపుడు, ఆ పార్టీ సిద్ధాంతాలకనుగుణంగా పోరాడాలి గానీ, ఎమర్జెన్సీ లో ఉన్నట్లు కాదని, ఒక విధంగా ‘లోక్ సత్తా’ అధినేత జేపీతో తనకు ఏ ఇబ్బందులు వచ్చాయో, ప్రస్తుతం పవన్ తో కూడా అవే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పొలిటిక్స్ అంటే వన్ మ్యాన్ షో కాదని, నియంతలాగా నేనొక్కడినే రన్ చేస్తాను అంటే కుదరదని, జేపీని కూడా అదే అన్నానని, అతను పవన్ కాదు కాబట్టి ఎవరూ ఫోకస్ చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సెకండ్ లెవల్ లీడర్ షిప్ లేకుండా నువ్వొక్కడివే ఊరేగడానికి నీకెందుకు పార్టీ? టైం పాస్ కోసం రాజకీయాలు ఎందుకు? క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవస్థాపన లేకుండా ఎలా నడపగలరు? ఇవన్నీ సరైన ప్రశ్నలే అని తాను అనుకుంటున్నానని, వీటిని ఎవరూ అడగకూడదు అనేది తప్పు అని, మనమందరం సైలెంట్ గా ఉండడం తప్పని అన్న మహేష్ కత్తి, వీళ్ళందరినీ దేవుళ్ళుగా పూజించుకుంటూ ఉండిపోదాం అనుకుంటే, తానేం చేయలేను, నేనైతే అలాంటి వాడ్ని కాదు, నాకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నమ్మకం ఉందని, అందుకే నేను మాట్లాడతాను… సింపుల్… అని చెప్పిన వ్యాఖ్యల్లో స్పష్టత ఉన్నట్లుగా కనపడింది.

ఇంతగా ప్రశ్నించిన మహేష్ కత్తి… రాబోయే రోజుల్లో పవన్ రాజకీయాలు మార్చుకుంటే, తానూ తన అభిప్రాయాన్ని మార్చుకుంటానని కుండబద్దలు కొడుతూ చెప్పారు. పవన్ గనుక పోటీచేస్తే గెలుస్తారేమో గానీ, పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గంలో తన క్యాండిడేట్స్ ను నిలబెడితే మాత్రం కష్టమని, అవగాహన లేని రాజకీయాలు చేయడం కష్టమని, తన అన్న చేసిన తప్పే ఈయన కూడా చేస్తాడా? లేక నేనేం చేసినా తప్పే కాదనే భ్రమలో బతుకుతున్నారా? పార్టీకి ఓ ఎజెండా ఉందా? ఇప్పటివరకు చంద్రబాబుకు మద్దతు పలుకుతూ ఉన్నారు, సడెన్ గా వచ్చి, ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేస్తానంటే, మేం ఎవరినీ నమ్మాలి? అంటూ లాజిక్ గా మాట్లాడారు.

‘ప్రశ్నించడానికే వచ్చాను’ అంటూ వేలేత్తితే, నిన్ను ప్రశ్నించడానికి మా దగ్గర వ్రేళ్ళు ఉన్నాయని మాత్రమే తాను చెప్తున్నానని, ఇది ప్రజాస్వామ్యంగా భావిస్తున్నానని చెప్పిన మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యల్లో పూర్తి స్పష్టత ఉందని చెప్పాలి. అయితే ఇదేదో పవన్ ను టార్గెట్ చేసుకుని కత్తి ఈ వ్యాఖ్యలు చేయలేదు, స్పష్టత లేకుండా రాజకీయాల పేరుతో ట్వీట్లు, బహిరంగ సభలు పెట్టడాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇంతలా పవన్ తీరును తప్పుపట్టిన మహేష్ కత్తి, ఉద్దానం వ్యవహారం క్రెడిట్ మొత్తం పవన్ దేనని అంగీకరించారు. తాను చెప్తున్నది కూడా అదే… మంచి చేస్తే మంచి చెప్తాం… తప్పు చేస్తే తప్పు అని ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తాం… అది పవన్ అయినా… అంటూ నిర్భయంగా చెప్తున్నారు.