Mahesh Kathi on caste politicsగత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులతో పోరాడుతున్న మహేష్ కత్తి, ఇక వారిని పక్కనపెట్టి, ఇతర రాజకీయ పార్టీలపై దృష్టి పెట్టినట్లుగా కనపడుతోంది. అందులో భాగంగా తొలుత కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు ఏ విధంగా దక్కాయో అంటూ ‘కుల’ ప్రస్తావనను తీసుకువచ్చారు. 8 మంది బ్రాహ్మణులు, ఇద్దరు వైశ్యులు, అయిదుగురు రాజ్ పుత్ లు… ఇలా పేర్లు, వారి కులాలను ప్రస్తావిస్తూ ఓ 27 మంది జాబితాను విడుదల చేసాడు మహేష్ కత్తి.

కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ చేసిన ఈ విమర్శతో, తన ఉద్దేశం కేవలం ‘జనసేన’ పార్టీ సిద్ధాంతాలపైన మాత్రమే కాదన్న సందేశాన్ని పవన్ అభిమానులకు ఇచ్చినట్లయ్యింది. నిజానికి ఇదే విషయాన్ని నేరుగా చాలా సందర్భాలలో అర్ధమయ్యే విధంగా మహేష్ వెలిబుచ్చినప్పటికీ, వాటిని పవన్ అభిమానులు పట్టించుకోకుండా విమర్శలు చేయడంతో, ఈ సారి వారిని పట్టించుకోకుండా తన విమర్శలు తాను చేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను “కుల డైనమిక్స్”గా అభివర్ణించారు.

మొత్తమ్మీద తన భావాలను వ్యక్తపరుచుకోవడానికి తనకు పూర్తి హక్కులు ఉన్నాయంటూ ఓ వేదిక మీద ప్రసంగాన్ని కూడా ఇచ్చారు. ఈ ఫోటోలను కూడా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసారు మహేష్. దీంతో పవన్ అభిమానులు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతగా హింసించినా తాను తగ్గేది లేదన్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా వచ్చిన హక్కును కాలరాయడానికి ఎవరికీ హక్కు లేదంటున్న మహేష్, మధ్యలో కులాలను ప్రస్తావించడం చూస్తుంటే… భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారేమో అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
Mahesh Kathi on caste politics