మహేష్ బాబు తెలివైన నిర్ణయం!‘మంది ఎక్కువైతే మజ్జిగ పలచన’ అన్న చందంగా 2022 సంక్రాంతి సమయానికి సినిమాలు రిలీజ్ లు సిద్ధం కావడంతో, ముందుగా రిలీజ్ డేట్ ను జనవరి 13వ తేదీ అని ప్రకటించినప్పటికీ, నాలుగు అడుగులు వెనక్కి తగ్గి తన “సర్కారు వారి పాట” విడుదలను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో సంక్రాంతికి “ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, బంగార్రాజు” సినిమాల రిలీజ్ లు ఫిక్స్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.

కానీ అందరి కంటే ముందుగా జనవరి 12వ తేదీన తమ సినిమా విడుదల అని ప్రకటించిన “భీమ్లా నాయక్,” చెప్పిన సమయానికి విడుదల కానుందా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా రిలీజ్ ఏపీ సర్కార్ రాజకీయ అంశాలతో ముడిపడి ఉండడంతో… ప్రస్తుతం అందరి చూపులు “భీమ్లా నాయక్”పై పడ్డాయి.

సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ విడుదల అయితే, టిక్కెట్ల పెంపుదల విషయంలో ఏపీ సర్కార్ సినీ ఇండస్ట్రీకి సహకరించదన్న భావన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ దెబ్బ ప్రత్యక్షంగా “ఆర్ఆర్ఆర్” మరియు “రాధే శ్యామ్”లపై నేరుగా పడనుంది. ఒకవేళ “భీమ్లా నాయక్” విడుదల వాయిదా వేసుకుంటే, ఆ రెండు పాన్ ఇండియన్ మూవీస్ కి లైన్ క్లియర్ అవుతుందనేది ఏపీ సినీ అండ్ పొలిటికల్ వర్గాల టాక్.

అసలు ఈ రచ్చంతా ఆలోచించాల్సిన పని లేకుండా “సర్కారు వారి పాట”ను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసి ప్రిన్స్ మహేష్ బాబు చాలా తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అప్పటికి ఈ టికెట్ల రేట్లు వివాదం పూర్తిగా సమసిపోతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చని, ముఖ్యంగా రాజకీయ వివాదాలకు దూరంగా సినిమాలు ఉంటాయనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

వివాదాలకు ఆమడంత దూరంలో ఉండే ప్రిన్స్, బహుశా ఈ రచ్చను ముందుగానే అంచనా వేసారేమో!?