Mahesh Babu - YS Jaganస్టార్ హీరోలను జగన్ సర్కార్ ట్రీట్ చేసినట్లుగా గతంలో ఏ ప్రభుత్వము కూడా ట్రీట్ చేయకపోవడంతో, గత అనుభవాలను నెమరువేసుకునే క్రమంలో ఆయా హీరోల అభిమానులు ఉన్నారు. ఇందులో భాగంగా మహానేతగా నీరాజనాలు పలికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో మహేష్ ను ఏ విధంగా చూసుకున్నారో, నిన్న జగన్ ఏ విధంగా చూసారో అన్న విషయం చర్చనీయాంశమైంది.

2005లో మహేష్ నటించిన “అతడు” సినిమాకు గానూ నంది అవార్డు రాగా, ఈ వేడుకను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో అట్టహాసంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ బహిరంగ వేదికపై అశేష అభిమానుల సమక్షంలో నంది అవార్డులను బహుకరించడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

కానీ నాడు మహేష్ కున్న క్రేజ్ ను గమనించిన వైఎస్సార్, తొలిసారిగా నంది అవార్డులను స్టేడియంలో ఏర్పాటు చేసి, దానిని రాజకీయంగా కూడా తన వైపుకు మలచుకున్నారు. నిజానికి మహేష్ ఇమేజ్ ను కాంగ్రెస్ కు అనుకూలంగా మలుచుకోవడంలో నాడు వైఎస్సార్ వేసిన ఎత్తుగడ ఫలించింది. అలాగే మహేష్ చేత చేయి ఎత్తించడానికి నాడు వైఎస్సార్ పడిన కష్టం తెలియనిది కాదు.

చివరికి సూపర్ స్టార్ కృష్ణ తన తనయుడు చేయి పట్టుకుని పైకి లేపితే మహేష్ అలా రెండు చేతులతో అభివాదాలు చేసారు. అలా సినీ ఇండస్ట్రీకి, స్టార్ హీరోలకు వైఎస్సార్ అంత గౌరవం ఇచ్చారు. తన కంటే వయసులో చిన్న వాడైనా, ప్రజలలో ఉన్న క్రేజ్, అభిమానం దృష్ట్యా మహేష్ కు ఆ స్థాయి గౌరవాన్ని అందించారు. ఆ మాటకొస్తే ఒక్క మహేష్ కే కాదు, రాజకీయాలకతీతంగా సినీ ఇండస్ట్రీలో అందరికి అదే స్థాయి గౌరవం దక్కింది.

అంతకుముందు, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అయితే టాలీవుడ్ కు ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరిచింది. కానీ నేటి పరిస్థితి వేరు, వైఎస్సార్ చేత నీరాజనాలు అందుకున్న మహేష్ బాబు, అదే వైఎస్సార్ తనయుడు జగన్ సృష్టించిన సమస్యకు అతనికే ‘థాంక్స్’ చెప్పడం, అలాగే అవమానకర రీతిలో లాన్ లో వదిలేయడం పట్ల మహేష్ ఎలా ఫీల్ అవుతున్నారో గానీ, ఫ్యాన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు.

ఒక నాయకుడుగా నాడు వైఎస్సార్ చిన్న – పెద్ద అన్న తారతమ్యం లేకుండా కలుపుకుపోగా, నేడు జగన్ చిన్న – పెద్ద అన్న తారతమ్యం లేకుండా అవమానించుకుని పోతున్నారన్న విమర్శలు నానాటికి ఎక్కువవుతున్నాయి. నాటి వైఎస్సార్ పర్యవసానాలు రాజకీయంగా ఎంతో ఉపయోగపడగా, నేడు వైఎస్ జగన్ అవలంభిస్తున్న విధానాలు రాజకీయంగా ఇంకా వెనక్కి నెడుతాయన్న హెచ్చరికలు ఆర్ఆర్ఆర్ వంటి ప్రముఖుల నుండి వ్యక్తమవుతున్నాయి.