mahesh babu warning to spyder producerషూటింగ్ జరుగుతున్నంత కాలం ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్తపడ్డ “స్పైడర్” సినిమాకు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం కాగానే లీకుల మీద లీకులు సోషల్ మీడియాలో విడుదల అవుతూ అటు చిత్ర యూనిట్ ను, ఇటు అభిమానగణాన్ని కంగారు పెడుతోంది. మహేష్ పుట్టినరోజు నాడు విడుదల కావాల్సిన టీజర్ మరియు తాజా ట్రైలర్… అనుకున్న సమయాని కంటే ముందే లీక్ కావడంతో పాటు, మధ్యలో ఓ రెండు నిముషాల ఫుటేజ్ లీక్ హంగామా చేసింది. ఇలా వరుసగా లీకుల బారిన పడుతోన్న “స్పైడర్” సినిమా పట్ల జాగ్రత్త వహించాల్సిన బాధ్యత నిర్మాత పైన ఉందని, పరోక్షంగా ఓ స్ట్రాంగ్ సందేశాన్ని ప్రిన్స్ పంపాడు.

‘స్పైడర్’ వేడుకపై ప్రిన్స్ ప్రసంగించిన సమయంలో… మమ్మల్ని నమ్మి అంత డబ్బు పెట్టినందుకు మేం ప్రాణం పెట్టి సినిమాను చేసాం, ఇక సెప్టెంబర్ 27వ తేదీన ధియేటర్స్ లోకి తీసుకెళ్ళి బ్లాక్ బస్టర్ ను చేయాల్సిన బాధ్యత మీపై ఉందంటూ నిర్మాతకు సూటిగా వేలు చూపించి మరీ సూచనలు చేసారు. అందుకు నిర్మాత ప్రసాద్ చిరునవ్వులు చిందించినప్పటికీ, మహేష్ చెప్పిన మాటల ఆంతర్యం అర్ధమైనట్లుగా హావభావాలు పండించారు. అందులోనూ ముందు వారం ‘జై లవకుశ’ కూడా విడుదల కానున్న నేపధ్యంలో… సరిపడిన ధియేటర్లను సెట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందన్న సంకేతాలను ప్రిన్స్ పంపినట్లయ్యింది.