Mahesh Babu - Unstoppable With NBK2021 ఎండింగ్ లో సిల్వర్ స్క్రీన్ పై “అఖండ” ఎంత కిక్ ఇచ్చిందో, ఆహాలో ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం అంతకు మించిన ఆనందాన్ని బాలయ్య అభిమానులకు మిగిల్చింది. ప్రతి వారం సరికొత్త సెలబ్రిటీలతో బాలయ్య చేసే విన్యాసాలు చూసి మైమరిచిపోతున్న ఫ్యాన్స్ కు నిరాశ ఎదురు కానుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో షూట్ చేసిన ఎపిసోడ్ ‘అన్ స్టాపబుల్’ సీజన్ 1 చివరి ఎపిసోడ్ గా ప్రసారం చేస్తామని ఇప్పటికే ‘ఆహా’ స్పష్టం చేసింది. తాజాగా దీనికి సంబంధించిన డేట్ కూడా వచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీన బాలయ్య – మహేష్ ల క్రేజీ ఎపిసోడ్ ఆహాలో ప్రసారం కానుందన్న సమాచారం రెండు అనుభూతులను మిగల్చనుంది.

ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య – మహేష్ అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా రమేష్ బాబు ‘కాలం’ చేసిన తర్వాత పూర్తిగా ముఖం చాటేసిన మహేష్ ను కాస్త జోష్ లో చూడాలన్న అభిమానుల ఆకాంక్ష ఈ ఎపిసోడ్ తో తీరనుండడంతో, ఎప్పుడెప్పుడు ఈ కలర్ ఫుల్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందోనని చూస్తున్నారు.

ఎట్టకేలకు రిలీజ్ డేట్ రావడంతో ఊపిరి పీల్చుకోవడం మహేష్ అభిమానుల వంతయ్యింది. అయితే ఇదే చిట్టచివరి ఎపిసోడ్ అవుతుండడం, ‘అన్ స్టాపబుల్’ సీజన్ 1 ముగుస్తుండడంతో, ఇంకా బాలయ్య చిలిపితనానికి, చలాకీతనానికి కొన్నాళ్లు బ్రేక్ వస్తుందన్న సమాచారం నందమూరి ఫ్యాన్స్ కు నిరాశను కలిగిస్తోంది.

ఏది ఏమైనా… సరికొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేసిన షోగా ‘అన్ స్టాపబుల్’ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే ఓటీటీలో మొదటిసారిగా రంగప్రవేశం చేసిన బాలయ్య, ఏకంగా మొదటి బంతిని స్టేడియం బయట పడేలా సిక్సర్ కొట్టి ఓటీటీకి కొత్త ఉత్సాహాన్ని, ఇతర హీరోలకు మరో మార్గాన్ని సృష్టించడంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించారు.