Mahesh Babu Tweets on Rangasthalam-కొత్తదనంతో కూడిన సినిమాలపై ట్వీట్స్ వేసి ప్రోత్సహించడంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు చూపిస్తున్న ఉత్సాహం నెటిజన్లకు తెలిసిందే. చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా ‘అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలపై కూడా ట్వీట్స్ వేసి అభినందించిన ప్రిన్స్, తాజాగా సుకుమార్ – రామ్ చరణ్ ల “రంగస్థలం” సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

మంచి ఇంటెన్స్ తో చెప్పడంలో సుకుమార్ మాస్టర్ అని అభివర్ణించిన ప్రిన్స్, రాక్ స్టార్ అని పిలవడానికి సరైన కారణాలు ఉన్నాయంటూ దేవికి కితాబందించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఖాతా నుండి మరో మంచి సినిమా వచ్చిందని, రామ్ చరణ్, సమంతల కెరీర్ లలో అద్భుతమైన అభినయాన్ని అందించారని, సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేసానని చెప్పుకొచ్చారు.

నిజానికి మహేష్ నుండి ఇలాంటి అభినందనల ట్వీట్స్ ఊహించినవే గానీ, కాస్త లేట్ అయ్యిందని చెప్పాలి. సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ ను స్వయంగా కలిసి నమ్రత శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ప్రిన్స్ నుండి ట్వీట్స్ రావడం విశేషం. ఇటీవల కాలంలో ప్రిన్స్ లో చాలా మార్పు కనిపిస్తోందని చెప్పడానికి నిదర్శనంగా ఈ ట్వీట్స్ నిలుస్తున్నాయి.