mahesh babu tweet about new ticket goవివాదరహితుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న పేరు తెలియనిది కాదు. ఇండస్ట్రీలో వేదికగా అనేక వివాదాలు ఉత్పన్నం అయినపుడు గానీ, రాజకీయాలకు – సినిమాలకు ముడిపడి అనేక సమస్యలు తలెత్తినపుడు గానీ, ఎపుడూ దూరంగా ఉన్న మహేష్, ఇటీవల మాత్రం తన సహజశైలికి విరుద్ధంగా ముందడుగు వేశారు.

ఏపీలో జరుగుతోన్న టికెట్ల వివాద పరిష్కారం కోసం చిరంజీవితో కలిసి జగన్ ఇంటి వద్దకు విచ్చేసిన మహేష్, అతి త్వరలోనే జీవో వచ్చేస్తుందని ప్రకటన ఇచ్చేసారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రెండు రోజుల క్రితం వెల్లడైన జీవో సంగతులు అందరికీ తెలిసినవే. అయితే జీవో విడుదలైన వెంటనే చిరంజీవి మాదిరి మహేష్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

దీంతో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహేష్ అసంతృప్తిగా ఉన్నారన్న భావన సోషల్ మీడియా వేదికగా వ్యక్తమయింది. కానీ ఉన్నట్లుండి జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ వేయడం చర్చనీయాంశమైంది. అంతేగాక ప్రభుత్వానికి – ఇండస్ట్రీకి మధ్య బలమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ఈ ట్వీట్ కు అభిమానుల నుండే వ్యతిరేకమైన స్పందన లభించింది. ఏదో మొక్కుబడిగా ఈ ట్వీట్ తప్పక వేయాల్సి వచ్చిందన్న అభిప్రాయం నెట్టింట వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ఇలాంటి మొహమాటపు ట్వీట్స్ కు మహేష్ పూర్తి వ్యతిరేకం. కానీ గత కొంతకాలంగా మహేష్ ట్విట్టర్ వేదికగా వచ్చే ట్వీట్స్ లో ఎక్కువ శాతం మొహమాటంతో కూడుకుని ఉన్నవే.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నంది అవార్డులు బహుకరించిన సమయంలో, బహిరంగ వేదికపై వైఎస్సార్ తో కలిసి కనీసం చేతులు లేపి అభివాదం చేయడానికి సుముఖత కనపరచని మహేష్, నేడు జగన్ ప్రభుత్వానికి మాత్రం ధన్యవాదాలు తెలుపడం అంటే ఇండస్ట్రీ వివాదానికి శుభంకార్డు వేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారా?

ఎందుకంటే ప్రభుత్వం నుండి జీవో వచ్చిన వెంటనే చిరంజీవి వేసిన ట్వీట్ పై పెద్ద రచ్చే జరిగింది. అది మెగాస్టార్ కు పూర్తిగా ప్రతికూలంగా మారింది. అసలు చిరు ఆ జీవో చదివారా? లేదో? అన్న భావన కూడా వ్యక్తం అయ్యింది. అది తెలిసిన తర్వాత కూడా సాహాసించి మహేష్ ట్వీట్ వేయడం ఓ రకంగా విమర్శలను ఆహ్వానించినట్లే అనుకోవచ్చు.

రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే మహేష్, తన బావ గల్లా జయదేవ్ ఎంపీగా పోటీ చేసిన తొలిసారి మాత్రం ఓ ట్వీట్ వేశారు. ఆ తర్వాత ప్రముఖ రాజకీయ నేతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి తప్ప, ప్రభుత్వాలను ఉద్దేశించి ప్రస్తావించలేదు. కానీ జగన్ సర్కార్ విషయంలో మాత్రం పూర్తిగా మొహమాటం కనపరుస్తున్నారన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి.

అయితే మహేష్ ఈ విధంగా మారిపోవడం అభిమానులకే రుచించడం లేదు. డ్రగ్స్ సహా ఇండస్ట్రీ అనేకానేక సమస్యలు ఎన్ని వచ్చినా, ఎప్పుడూ మహేష్ పేరు వినిపించలేదు. అలాంటి మహేష్ ను అమితంగా ఇష్టపడే అభిమానగణానికి, ప్రస్తుతం మహేష్ ప్రవర్తిస్తున్న విధానం కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. తమ క్యారెక్టర్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇలాంటి అనుభవాలు చవిచూడడం తప్పదు మరి!