Mahesh Babu SPYder USA rightsఈ దసరాకు విడుదల కాబోతోన్న రెండు పెద్ద సినిమాలో ఏది ఖచ్చితంగా ‘సూపర్ హిట్’ అవుతుందో ఇప్పుడే చెప్పలేం గానీ, యుఎస్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఏ సినిమా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందో అన్న విషయం మాత్రం స్పష్టంగా చెప్పేయవచ్చు. యుఎస్ మార్కెట్ లో ‘టాలీవుడ్ కింగ్’ అయిన ప్రిన్స్ మహేష్ బాబు “స్పైడర్” తన హవాను కొనసాగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టాక్ వస్తే ‘జై లవకుశ’ను కూడా తక్కువగా అంచనా వేయలేం గానీ, ‘స్పైడర్’ విషయంలో టాక్ తో నిమిత్తం లేకుండా ప్రిన్స్ కెరీర్ లో ఆల్ టైం రికార్డును సృష్టించే సినిమాగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగునాట భారీ డిజాస్టర్ గా మారిన ‘బ్రహ్మోత్సవం’ కూడా యుఎస్ లో వన్ మిలియన్ డాలర్స్ ను వసూలు చేసి ప్రిన్స్ రేంజ్ చాటింది. ప్రీమియర్ షోల ద్వారానే ఇందులో ఎక్కువ శాతం రాబట్టగా, తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న ‘స్పైడర్’ కూడా ప్రీమియర్ షోల ద్వారానే రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ పండితుల టాక్. ప్రీమియర్స్ షోల ద్వారా దాదాపుగా 1.5 నుండి 2 మిలియన్స్ వరకు రాబట్టడమే లక్ష్యంగా ‘స్పైడర్’ సిద్ధమవుతోంది. ‘బాహుబలి 2’ తర్వాత అత్యధిక లొకేషన్స్ లో ప్రీమియర్స్ ను ప్రదర్శిస్తోన్న సినిమాగా ప్రిన్స్ సరికొత్త చరిత్రకు నాంది పలకనున్నారు.

ప్రస్తుత సమాచారం ప్రకారం తెలుగు మరియు తమిళ భాషలలో దాదాపుగా 650 స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి ఇది ఎక్కువే అయినప్పటికీ, ప్రిన్స్ – మురుగదాస్ కాంబోపై ఉన్న అంచనాల రీత్యా, స్పందన అదిరిపోతుందనే భావనతో ఈ స్థాయిలో విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల సమయం దగ్గరపడితే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ స్థాయిలో విడుదలై, హిట్ టాక్ వస్తే మాత్రం ‘బాహుబలి’ సాధించిన 6.8 మిలియన్స్ కలెక్షన్స్ కనుమరుగు కావడం తధ్యం. ఒకవేళ హిట్ టాక్ రాకపోయినప్పటికీ, 3-4 మిలియన్ డాలర్స్ చేరడం అన్నది ‘స్పైడర్’కు కష్టసాధ్యమైన విషయం కాదు.

అయితే యుఎస్ మార్కెట్ సాధారణంగా వీకెండ్స్ లో మాత్రమే ఉంటుంది. కానీ ‘స్పైడర్’ బుధవారం నాడు రిలీజ్ కానుంది. ఇక్కడే ప్రిన్స్ ప్రభంజనం ఏమిటో నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఆ స్థాయిలో హైప్ రావాలంటే, ఈ శుక్రవారం నాడు విడుదల కాబోతోన్న ధియేటిరికల్ ట్రైలర్ స్టన్నింగ్ గా ఉండాల్సిందే. లేదంటే ‘స్పైడర్’ యూనిట్ అంచనాలు వేసిన ఓపెనింగ్స్ అసాధ్యమనే భావించవచ్చు. ‘జై లవకుశ’ భారీ విజయం సాధించినా యుఎస్ మార్కెట్ లో 2-3 మిలియన్ డాలర్స్ కే పరిమితం అవుతుందనే అంచనాలు ఉండగా, ‘స్పైడర్’ విషయంలో మాత్రం దీనికి రెండింతలు రాబట్టవచ్చనే విశ్వాసం ఉండడంతో ట్రైలర్ పైనే అందరి చూపులు నెలకొన్నాయి.