సెప్టెంబర్ 27వ తేదీ కోసం ప్రిన్స్ అభిమానులు ఎలా నిరీక్షిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘బ్రహ్మోత్సవం’ వంటి దారుణ పరాజయం తర్వాత మహేష్ స్టామినా ఏంటో చూపించే సినిమాగా నిలుస్తుందని భావిస్తున్న “స్పైడర్” లెక్కలు మారుస్తుందన్న భావనలో ట్రేడ్ వర్గాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ‘బాహుబలి 2’ తర్వాత మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల కానున్న భారీ తెలుగు సినిమాగా అందరి కళ్ళు “స్పైడర్”పై ఉన్నాయి. మరి ‘బాహుబలి 2’ విజయంలో ప్రమోషన్స్ ఎంత కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలిసిందే.

మారి ఆ స్థాయిలో ‘స్పైడర్’కు కూడా పబ్లిసిటీ ఇస్తారా? ఖచ్చితంగా అవుననే సమాధానమే లభిస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం కాగా… ఇప్పటినుంది ప్రతి బుధవారం వారానికొకటి చొప్పున సినిమాకు సంబంధించిన ఏదొక అప్ డేట్ ప్రేక్షకులను పలకరించనుంది. గడిచిన బుధవారం నాడు రెండు పోస్టర్స్ తో ప్రారంభమైన ఈ ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా విడుదల వరకు కొనసాగనున్నాయి. రాబోతున్న బుధవారం నాడు అంటే ఆగష్టు 2వ తేదీన “స్పైడర్”కు సంబంధించిన మొదటి పాట విడుదల కానుందని తెలుస్తోంది.

దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏమీ వెలువడలేదు గానీ, ఈ సినిమా ఆడియో హక్కులను దక్కించుకున్న ‘జీ మ్యూజిక్’ సంస్థ నుండి ఈ పాట విడుదల కానుందని సమాచారం. నిజానికి ముందుగా ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, తొలి పాట తర్వాత మేకింగ్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత బుధవారం నాడు మహేష్ పుట్టినరోజున “స్పైడర్” మరో టీజర్ అభిమానులను ఊపేయడానికి సిద్ధమవుతోంది. ‘స్పైడర్’ టీం పాటిస్తోన్న ఈ బుధవారం సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి..!