Spyder Piracyఅగ్ర హీరోల సినిమాలు విడుదలైన సమయంలో ‘పైరసీ’ గురించి చేసే హంగామా తెలియనిది కాదు. గతంలో ‘బాహుబలి 2’ సినిమా సందర్భంలో… ఈ సినిమా పైరసీ లింక్స్ ను ఎవరైనా షేర్ చేసుకున్నా, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్వయంగా రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలైన మొదటి రోజే హిందీ, తమిళ వర్షన్ లకు సంబంధించిన పైరసీ ప్రింట్లు వెబ్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆ మరుసటి రోజు తెలుగు వర్షన్ ది కూడా బయటకు వచ్చింది.

రెండు రోజులకే మూడు భాషలలోని ‘బాహుబలి 2’ పైరసీ లింక్స్ పబ్లిక్ ఫ్లాట్ ఫాంపై ఉన్నాయి. కానీ వాటిపై చర్యలేవీ లేవు. ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాధమ్,’ ఇటీవల ‘జై లవకుశ’ సినిమా విడుదలైనపుడు కూడా అభిమానులను అలర్ట్ చేస్తూ చిత్ర యూనిట్ ప్రత్యేకంగా పోస్టర్లను విడుదల చేసింది. ఈ సినిమాలకు సంబంధించిన పైరసీ లింక్స్ ఎక్కడైనా కనిపిస్తే… మాకు తెలియజేయండి, మెయిల్ చేయండి… అంటూ సవివరంగా తెలుపుతూ అభిమానులను ఉత్తేజపరిచింది.

దీనికి తగ్గట్లుగానే అభిమానులు కూడా రియాక్ట్ అయ్యారు. ‘జై లవకుశ’ సినిమా రెండవ రోజుకే పైరసీ ప్రింట్ నెట్ లోకి వచ్చిన దరిమిలా సదరు లింక్స్ ను చిత్ర యూనిట్ కు షేర్ చేసిన అభిమానులు కోకొల్లలు. కానీ ఫలితం ఏమైనా ఉందా? అంటే… ఇప్పటికీ అవే లింక్స్ అలాగే దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇదే బాటలో ‘స్పైడర్’ సినిమా కూడా నిలుస్తోంది. పైరసీ లింక్స్ ను తెలియజేయమంటూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అయితే సినిమా విడుదల కావడం, ఒకటి లేక రెండు రోజుల్లో నెట్ లో ప్రత్యక్షం కావడం, అభిమానులు ఫిర్యాదులు చేయడం… అంతా రొటీన్..!

కానీ వీటి వలన ఇసుమంత ప్రయోజనమైనా ఉండదని చెప్పవచ్చు. కేవలం అభిమానులు తమ విలువైన సమయాన్ని కేటాయించి, ఈ పైరసీ లింక్ లను చిత్ర యూనిట్ కు తెలియజేయడం తప్ప, నిజంగా చిత్ర యూనిట్ చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఫ్యాన్స్ ను ఉత్సాహపరచడానికి చేస్తున్నారో లేక నిజంగా పైరసీపై పోరాటం చేయాలని భావిస్తున్నారో గానీ… పెద్ద సినిమా విడుదలైన ప్రతిసారి ఆయా హీరోల అభిమానుల విలువైన సమయాన్ని చిత్ర నిర్మాణ సంస్థలు దోచుకుంటున్నాయని చెప్పాలి.