Mahesh Babu egoటాలీవుడ్ హీరోలకు ‘ఈగో’లు ఎక్కువ. అందుకే ఒకరికొకరు వేడుకలపై కలుసుకోరు అన్న విమర్శ ఉంది. గతాన్ని పరిశీలిస్తే ఇందులో వాస్తవం లేకపోలేదు. ముందు తరంలో వెంకటేష్ వంటి హీరోలు ఇలాంటి ‘ఈగో’లకు మినహాయింపు కాగా, ప్రస్తుత తరంలో ప్రిన్స్ మహేష్ బాబు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తను చెప్పాల్సిన విషయాన్ని మొహమాటం, ఈగో వంటి వాటిని ప్రదర్శించకుండా చెప్పడంలో ప్రిన్స్ కు మరొకరు సాటిలేరు అనే విధంగా ముందుకు వెళ్తున్నారు.

సాధారణంగా ఒక హీరో మరో హీరో పేరును ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన సమయంలో వారి అభిప్రాయాలు చెప్పకుండా… ‘అందరూ అంటా ఉంటారు…’ అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేయడం మన హీరోలకు ‘వెన్నతో పెట్టిన విద్య.’ కానీ, ప్రిన్స్ శైలి మాత్రం విరుద్ధం. చెప్పాలని అనిపిస్తే… ఎలాంటి ఈగోలను ప్రదర్శించకుండా ‘టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ జూనియర్ ఎన్టీఆర్’ అని స్పష్టంగా చెప్పేస్తారు, లేదు అంటే ‘ఈ ప్రశ్నను వదిలేయండి’ అంటూ సున్నితంగా చెప్పేస్తారు. గతంలో మహేష్ బాబు ఇంటర్వ్యూలను చూస్తే ఈ సంగతులను ఇట్టే చెప్పేయవచ్చు.

అందుకే ప్రస్తుత తరంలో ‘మల్టీ స్టారర్’ సినిమాలకు కూడా శ్రీకారం చుట్టిన ఘనత మహేష్ బాబుకు మాత్రమే సాధ్యమైంది. ‘ఈగో’ ఉండడం తప్పు కాదు గానీ, అది ఎక్కడ ప్రదర్శించాలో… ఎక్కడ ప్రదర్శించకూడదో… ప్రిన్స్ కు తెలిసినట్లుగా మరొకరికి తెలియదు అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే టాలీవుడ్ లో ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ అన్న పదానికి తార్కాణంగా ప్రిన్స్ మహేష్ బాబును చూపిస్తారు సినీ జనాలు.