mahesh babu - Rakul Preet Singh - Spyder movie .jpgఓ వైపు ‘స్పైడర్’కు సంబంధించిన వీడియోలన్నీ వరుసగా నిరాశపరచగా, మరో వైపు ఈ సినిమా పోస్టర్స్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటున్నాయి. సెప్టెంబర్ 9వ తేదీన ఆడియో విడుదలను పురస్కరించుకుని, తాజాగా విడుదల చేసిన స్టిల్స్ లో రుమేనియాలోని ఓ స్టిల్ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. షార్ట్ ప్యాంట్స్ లో కనపడుతున్న మహేష్ బాబుపై రకుల్ వాలిన ఈ పోస్టర్, ప్రిన్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

ఇప్పటివరకు తాము కావాలనుకుంటోంది ఇదే కదా… అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు ఆడియోను కూడా ఈ నెల 9వ తేదీన చెన్నైలో జరగనున్న వేడుక మీదే విడుదల చేయబోతున్నారు. ఈ వేడుకకు తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ మరియు టాలీవుడ్ నెంబర్ 1 దర్శకుడు రాజమౌళిలు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.

ఇక, తెలుగు నాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో 15వ తేదీన గ్రాండ్ గా ప్లాన్ చేసారు. పాటల హంగామా కూడా ఈ శనివారంతో ముగియనుండడంతో, ధియేటిరికల్ ట్రైలర్ విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 9వ తేదీన చెన్నైలో విడుదల చేస్తారా? లేక 15న హైదరాబాద్ లో విడుదల చేస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. ‘బాహుబలి’ తర్వాత దాదాపుగా 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా మార్కెట్ వర్గాల్లో ఇప్పటికే ‘స్పైడర్’ పేరు మారుమ్రోగుతోంది. ఇందులో 120 కోట్లు కేవలం ధియేటర్ల హక్కుల నుండే వచ్చినట్లు సమాచారం.